Shivalik Sharma : ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ మాజీ క్రికెటర్ శివాలిక్ శర్మ(Shivalik Sharma) అరెస్ట్ అయ్యాడు. అత్యాచారం కేసులో సోమవారం అతడిని రాజస్థాన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోధ్‌పూర్‌కు చెందిన శివాలిక్పై అతడి మాజీ ప్రేయసి రేప్ కేసు పెట్టింది. దాంతో, క్రికెటర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తదుపరి విచారణ వేగవంతం చేశారు.
అసలేం జరిగిందంటే.. గతంలో శివాళిక్ ఒక అమ్మాయితో సన్నిహితంగా ఉండేవాడు. అయితే.. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి శివాలిక్ తనను లోబరచుకున్నాడని.. ఆమె ఈమధ్యే స్థానిక పోలీసులను ఆశ్రయించింది. అంతేకాదు వివాహం విషయమై మాట్లాడేందుకు ఇంటికి వెళితే శివాళిక్ తల్లిదండ్రులను తనను అవమానించారని తన ఫిర్యాదులో వివరించింది.
#Jodhpur: IPL खिलाड़ी के खिलाफ दुष्कर्म का मामला, Shivalik Sharma को पुलिस ने किया गिरफ्तार
#FINVideo #RajasthanWithFirstIndia #RajasthanNews #ShivalikSharma #IPL @CP_Jodhpur pic.twitter.com/9wfRD74y0R— First India News Rajasthan (@1stIndiaNewsRaj) May 5, 2025
‘శివాళిక్పై నమోదైన అత్యాచారం కేసు వివరాలను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆనంద్ రాజ్‌పురోహిత్ మీడియాకు వెల్లడించాడు. క్రికెటర్ శివాలిక్ చేతిలో మోసపోయిన అమ్మాయి ఉండేది జోధ్‌పూర్‌లోని భగస్థానిలో. ఇద్దరికీ 2023 ఫిబ్రవరిలో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరూ జంటగా తిరిగారు. ఆమెను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని శివాలిక్ నమ్మబలికాడు. ఈ క్రమంలోనే ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.
తీరా.. నిశ్చితార్థం అనంతరం వివాహం చేసుకునేందుకు వెనుకాడాడు. తనకు ఆవిడను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తెగేసి చెప్పాడు. అతడి అమ్మానాన్న కూడా బాధితురాలిని సూటిపోటీ మాటలతో వేధించారు. అంతేకాదు ఆమెతో శివాళిక్కు జరిగిన పెళ్లి చూపులను కూడా 2024 ఆగస్టులో రద్దు చేసుకున్నారు. దాంతో, గత్యంతరం లేని పరిస్థుతుల్లో ఆ అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది’ అని ఏసీపీ తెలిపాడు.
బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన శివాలిక్ ముంబై ఇండియన్స్ స్క్వాడ్‌లో సభ్యుడు. 2024 వేలంలో అతడిని రూ.20 లక్షలకు ముంబై ఫ్రాంచైజీ కొన్నది. అయితే.. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. రంజీల్లో మాత్రం 18 మ్యాచ్‌లు ఆడాడంతే. లిస్ట్ ఏలో 13, దేశవాళీ టీ20ల్లో 19 మ్యాచ్‌లు ఆడాడు. చివరిసారిగా శివాలిక్ 2025 జనవరిలో వడోదర తరఫున రంజీ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు.