మునుగోడు, మే 05 : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొలుగూరి నరసింహ అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో ఉపాధి కూలీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వేసవి కాలంలో పని ప్రదేశాల్లో మంచినీరు, టెంట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ వంటి కనీస సౌకర్యాలు లేక ఉపాధి హామీ కూలీలు నానా అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు పారా, గడ్డపార, తట్ట పనిముట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పని దినాలు 200 రోజులు కల్పించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజువారి వేతనం రూ.700 ఇవ్వాలన్నారు.
పని ప్రదేశాల్లో ఫొటోస్ స్కానింగ్ విధానాన్ని ఎత్తివేయాలని, నాలుగు నెలలుగా ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు రావడం లేదని, వారి పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కూలీలకు కూడా పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు ఎండీ జానిమియా, మునుగోడు మండల నాయకులు రేవల్లి అంజయ్య, దుబ్బా వెంకన్న, కురుమర్తి సైదమ్మ, దుబ్బ భాగ్యమ్మ, పారిజాతమ్మ, చాపల ప్రమీల, యాదమ్మ, పద్మ, జయమ్మ పాల్గొన్నారు.