Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్‌లో పతకం చేజారిన బాధలో రెజ్లింగ్ వదిలేసిన వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) ఎట్టకేలకు యూ టర్న్ తీసుకోనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన వినేశ్ మళ్లీ తనకెంతో ఇష్టమైన ఆటలో మెరువనుంది. మల్ల యోధురాలైన ఆమె ఒలింపిక్ పతకం కలను నిజం చేసుకోవడంపై దృష్టి పెట్టనుంది. అవును మీరు చదువుతున్నది నిజమే. రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కి తీసుకోవడంపై వినేశ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన నాలుగు వాఖ్యాలున్న హిందీ పద్యాన్ని పోస్ట్ చేసింది.
ఇంతకూ వినేశ్ తన పోస్ట్‌లో ఏం రాసిందంటే.. ‘ఈరోజు నువ్వు అలసిపోయావు సరే. ఈరోజు నువ్వొక గాయపడిన పక్షివి. కానీ, నీలో ధైర్యం మాత్రం చెక్కుచెదరలేదు. నీ లక్ష్యం కోసం నువ్వు ఇంకా బతికే ఉండాలి’ అంటూ వినేశ్ సంక్షిప్త పోస్ట్‌లో తన అభిమతాన్ని చెప్పకనే చెప్పింది. దాంతో, అభిమానులు ‘వినేశ్ ది ఫైటర్.. రెజ్లింగ్‌కు మళ్లీ స్వాగతం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
పారిస్ ఒలింపిక్స్ 51 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్ ఫొగాట్ అనూహ్యంగా పతకం కోల్పోయింది. గోల్డ్ మెడల్ ఫైట్‌కు ముందు 100 గ్రాముల అదనపు బరువు కారణంగా ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు. దాంతో, వినేశ్ పతక కల చెదిరింది. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఆమె క్రీడా కోర్టులో అప్పీల్ చేసింది. కానీ, సదరు కోర్టు సైతం తాము ఏమీ చేయలేమంటూ చేతులెత్తేసింది. దాంతో, నిరాశగా వినేశ్ స్వదేశానికి వచ్చేసింది.