Srisailam | కార్తీక మాసోత్సవాల సందర్భంగా శ్రీశైలం మహాక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కల్పిస్తున్న ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి సోమవారం పరిశీలించారు. క్యూ లైన్లు, విరాళాల సేకరణ కేంద్రం వంటి ప్రాంతాలను ఆయన పరిశీలించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు క్యూలైన్లలో వెళుతున్న భక్తులు ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు రాజశేఖరరెడ్డి సూచించారు. సర్వ దర్శనం, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం క్యూలైన్లలో వెళుతున్న భక్తులు సౌకర్యవంతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
శ్రీశైల దేవస్థానం పరిధిలో నిర్వహిస్తున్న గో సంరక్షణ శాలను కూడా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సోమవారం సందర్శించారు. దేవస్థానం ఆధ్వర్యంలో గోవుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు, రోజువారీగా గో గ్రాసం వినియోగం, గో సంరక్షణకు వినియోగించే ఔషధాలు, విభూతి తయారీ, విభూతి అమ్మకాలు తదితర అంశాలను పరిశీలించారు. దీనికి సంబంధించిన వివరాలను ఎమ్మెల్యే రాజశేఖరరెడ్డికి దేవస్థానం ఇన్ చార్జీ కార్య నిర్వహణాధికారి ఈ చంద్రశేఖర్ రెడ్డి వివరించారు.
అవసరమైతే గోవుల సంరక్షణకు గోశాలలో మరో షెడ్ నిర్మించాలని ఇంజినీరింగ్ అధికారులకు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి సూచించారు. ముఖ్యంగా గో సంరక్షణ శాలలోని గోవులకు శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా పౌష్టికమైన ఆహారం అందించాలన్నారు. ఎప్పటికప్పుడు గోవులకు తగినంత మేత, తాగునీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని గోశాల సిబ్బందికి సూచించారు. గోవులకు అంటు వ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కాలానుగుణంగా వాటికి టీకా మందులు వేయించాలన్నారు.గోవుల సంరక్షణకు అవసరమైన అన్ని ఔషధాలు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు.
గో సంరక్షణ శాలలోని విభూతి తయారీ కేంద్రంలో విభూతి తయారీ ప్రక్రియను ఎమ్మెల్యే రాజశేఖరరెడ్డి పరిశీలించారు. ఆలయాన్ని సందర్శించే భక్తుల రద్దీకి అనుగుణంగా విభూతి తయారీ ఉండాలని చెప్పారు.
ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి సమక్షంలో మార్కాపురం వాసి ఎల్వీ ప్రసాదరెడ్డి పలు రకాల గోవుల ఔషధాలను గో సంరక్షణ శాలకు విరాళంగా అందజేశారు. తమ తండ్రి- పశు వైద్యులు డాక్టర్ ఎల్వీ నారాయణ రెడ్డి జ్ఞాపకార్థం గోవుల సంరక్షణకు ఔషధాలు అందిస్తున్నట్లు దాత ఎల్వీ ప్రసాద రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.