Manu Bhaker : ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన షూటర్ మను భాకర్(Manu Bhaker) బ్రేక్‌ను ఆస్వాదిస్తోంది. ఇష్టమైన ఫుడ్ తింటూ.. పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ విరామాన్ని తనకు నచ్చినట్టుగా గడుపుతోంది. విశ్వ క్రీడల అనంతరం మూడు నెలల విరామం తీసుకున్న మను షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్ పోటీలకు దూరమైంది. దాంతో, ఆమె ఎక్కడికి వెళ్లినా మళ్లీ తుపాకీ పట్టేది ఎప్పుడు? అని అడుగుతున్నారు. దాంతో, ఎట్టకేలకు ఒలింపిక్ విజేత సమాధానం ఇచ్చింది. త్వరలోనే తాను పోటీలకు సిద్ధమవుతానని మను చెప్పింది.
ఒలింపిక్స్ పతకం కోసం సుదీర్ఘ సాధన చేసిన మను తన కల నిజం చేసుకుంది. కోచ్ జస్పాల్ రాణా(Jaspal Rana) శిక్షణలో రెండు కాంస్యాలతో చరిత్రను తిరగరాసింది. ఆ తర్వాత 3 నెలల విరామం తీసుకున్న ఆమె తన పునరాగనంపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘ఒలింపిక్ పతకం గెలిచాక నీ జీవితంలో ఏమారింది? అని చాలామంది నన్ను అడుగుతున్నారు. వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే.. ఏమీ మారలేదు. నేను పాత మనునే. కాకపోతే బ్రేక్‌ను ఎంజాయ్ చేస్తున్నా. నవంబర్‌లో మళ్లీ నేను షాటింగ్ సాధన మొదలు పెడతాను. మీ ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు’ అని మను తన వీడియో పోస్ట్‌లో వెల్లడించింది.
ఈమధ్య మను భాకర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇంటర్వ్యూలు, ఫంక్షన్లు.. ఇలా ఎక్కడికి వెళ్లినా సరే పారిస్‌లో సాధించిన రెండు కాంస్య పతకాలను మనూ తన వెంట తీసుకెళ్లడంపై ఆన్లైన్లో కొందరు ట్రోల్ చేశారు. అయితే. అందుకు మను అవి దేశం కోసం సాధించిన పతకాలు. నన్ను షోలకు, ఇంటర్వ్యూలకు ఆహ్వానించే వాళ్లు ఆ మెడల్స్‌ను తీసుకు రావాలని అడుగుతున్నారు. అక్కడ వాళ్లంతా ఎంతో సంతోషంగా నాతో సెల్ఫీలు దిగుతున్నారు అని మను విమర్శకులకు చెక్ పెట్టింది.
పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ దేశం తరఫున పతక బోణీ కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల వ్యక్తిగత విభాగంలో కంచు మోత మోగించింది. ఆ తర్వాత సరబ్జోత్ సింగ్ జతగా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టర్ మిక్స్డ్ ఈవెంట్లోనూ సత్తా చాటిన ఆమె దేశానికి రెండో కాంస్యం అందించింది. దాంతో, ఒకే విశ్వక్రీడల్లో రెండు కాంస్యాలతో చరిత్ర పుటల్లో నిలిచింది.