హిమాయత్‌నగర్,సెప్టెంబర్27 : రోడ్డు మధ్యలో బొలేరో వాహనాన్ని నిలిపి ట్రాఫిక్ అంతరాయం(Obstructing traffic) కలిగించడంతో పాటు విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించిన వాహన డ్రైవర్‌పై శుక్రవారం నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం గోల్కొండ ప్రాంతానికి చెందిన సర్వర్(25) బొలేరో వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హిమాయత్‌నగర్ మినర్వా హోటల్ వద్ద రోడ్డు మధ్యలో నిలుపడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది.
బ్లూ కోర్టు కానిస్టేబుల్ నర్సింహాచారి, హోంగార్డు శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని వాహనాన్ని పక్కకు తీయాలని సూచించగా తననే పక్కకు తీయామంటావా అంటూ సర్వర్ వారి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. తమ విధులకు ఆటంకం కల్గించడంతో పాటు దురుసుగా ప్రవర్తించిన సర్వర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కానిస్టేబుల్ నర్సింహాచారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సర్వర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు.