అమరావతి : తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం టీటీడీ(TTD) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వెంటనే దానిని అమలు చేస్తూ తిరుమల (Tirumala) లోని ముఖ్య వీధుల్లో బోర్డులను ఏర్పాటు చేశారు. వైసీపీ పాలనలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి (Laddu Adultration) వాడారన్న చంద్రబాబు చేసిన ఆరోపణలతో తిరుమల పవిత్రత దెబ్బతిందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఆరోపించారు.
స్వయాన ముఖ్యమంత్రి ఆరోపణలతో తిరుమలకు కలిగిన అపవిత్రత నుంచి ఆలయానికి, రాష్ట్ర ప్రజలకు మేలు కలుగాలని కోరుతూ పాప ప్రక్షాళన కోసం జగన్ శనివారం తిరుమలలో స్వామివారి దర్శనానికి నిశ్చయించారు. అయితే కొందరూ ఇతర మతస్థుడంటూ విమర్శిస్తూ జగన్ తిరుమలకు వస్తే అడ్డుకుంటామని బీజేపీతో పాటు ధార్మిక సంఘాలు హెచ్చరించాయి.
తిరుమలకువస్తే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిందే నంటూ డిమాండ్లు రావడంతో స్పందించిన టీటీడీ హిందూయేతరుల కోసం తిరుమలలో ప్రత్యేకంగా బోర్డులను ఏర్పాటు చేసింది. అన్యమతస్థులు పాటించాల్సిన నియమ నిబంధనలు తెలుపుతూ వైకుంఠం కాంప్లెక్స్, ఏటీసీ సర్కిల్, గోకులం గెస్ట్‌హౌస్‌ల వద్ద బోర్డులను నెలకొల్పింది. అయితే ఏర్పాటు చేసిన కొన్ని గంటల్లోనే వైకుంఠం కాంప్లెక్స్ మినహా మిగతా అన్ని చోట్ల వాటిని తొలగించారు.