INDW vs ENGW : ఐదు టీ20ల సిరీస్‌లో భారత మహిళల జట్టు అదిరే బోణీ కొట్టింది. ట్రెంట్‌బ్రిడ్జిలో ఇంగ్లండ్‌ను వణికిస్తూ విజయం సాధించింది. స్మృతి మంధాన(112) సూపర్ సెంచరీతో కొండంత స్కోర్ కొట్టిన టీమిండియా.. అనంతరం ప్రత్యర్థిని 113కే కట్టడి చేసి 97 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. స్పిన్నర్ శ్రీ చరణి(4-12) విజృంభణతో ఆతిథ్య జట్టు బ్యాటర్లు చేతులెత్తేశారు. అర్ద శతకంతో పోరాడిన నాట్ సీవర్ బ్రంట్ ఔటైన కాసేపటికే ఇంగ్లండ్ కుప్పకూలింది. దాంతో, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
టీమిండియా నిర్దేశించిన భారీ ఛేదనలో ఇంగ్లండ్ ఆది నుంచి తడబడింది. పవర్ ప్లేలోనే రెండు వికెట్లు కోల్పయిన జట్టును కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్(66) ఆదుకుంది. సహచరులు విఫలం అయినా ఆమె దూకుడుగా ఆడి అర్ధ శతకం సాధించింది. కానీ, భారత బౌలర్లు వికెట్ల వేట కొనసాగించగా.. వచ్చినవాళ్లు వచ్చినట్టు పెవిలియన్ చేరారు.15వ ఓవర్ తొలి బంతికే నాట్ సీవర్‌ను శ్రీ చరణి ఔట్ చేసింది. అదే ఓవర్లో లారెన్ బెల్‌ను చరణి ఔట్ చేయడంతో భారత జట్టు 97 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఐదు టీ20ల సిరీస్ తొలిమ్యాచ్‌లోనే భారత మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. నాటింగ్హమ్లోని ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన(112) అకాశమే హద్దుగా చెలరేగింది. ఈ ఫార్మాట్లో తొలి శతకంతో ఆమె గర్జించగా.. హర్లీన్ డియోల్(43) మెరుపు బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడింది. ఈ ఇద్దరి విధ్వసంతో టీమిండియా పొట్టి క్రికెట్లో టీమిండియా రెండో అత్యధిక స్కోర్ కొట్టింది. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 రన్స్ చేసిన మంధాన బృందం ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది.