Siddipet | సిద్ధిపేట, జూన్28 : గ్రామ పంచాయతీల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కే హైమావతి అధికారులను ఆదేశించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ అధికారులతో వనమహోత్సవం కార్యచరణ, ఎన్ఆర్ ఈజీఎస్ పనుల వేగవంతం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా వివిధ మండలాలకు ఇచ్చిన లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. ఎన్ఆర్ ఈజీఎస్ ద్వారా గుర్తించిన వివిధ ప్రాంతాల్లో ఫిట్టింగ్, ప్లాంటింగ్ చేయాలన్నారు. ప్లాంటింగ్ చేయగానే టీజీఎఫ్ఎంఎస్ సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. సంరక్షణ బాధ్యతలు తీసుకున్న ఏజెన్సీలు సకాలంలో ఫర్టిలైజర్, నీటిని అందిస్తే మొక్కలు ఏపుగా పెరిగే ఆస్కారం ఉందన్నారు.
పెట్టిన ప్రతి మొక్క బతకాలని, అధికారులు తరచూ పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. వేప, రావి, మర్రి, చింత, నేరేడులాంటి మొక్కలు ఎక్కువ శాతం నాటాలన్నారు. ప్రతి మండలంలో వీఐపీ ప్లాంటేషన్ కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఆయా మండల ప్రజాప్రతినిధుల సమక్షంలో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఉద్యానవన శాఖలో 1335 ఎకరాల టార్గెట్‌కి ఇప్పటి వరకు 428 రైతులు 748 ఎకరాల్లో పలు రకాల తోటల పెంపకానికి గుర్తించినట్లు తెలిపారు. మిగతా లక్ష్యాన్ని సైతం ఆగస్టులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈత, మునగ తోటకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మామిడి, జామ, సీతాఫలం, నారింజ, కొబ్బరి తోటలు పెట్టాలని ఇదివరకు తోటల పెంపక రైతులతో గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి రైతులను ప్రోత్సహించాలని చెప్పారు.
ఈజీఎస్‌లో కూలీల శాతం పెంచాలని, సీసీరోడ్ల నిర్మాణం, డ్రైనేజీలు, అంగన్వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలను ఇంజినీరింగ్ అధికారులు తరచూ పర్యవేక్షించాలని.. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తయ పనులకు ఎస్టిమేట్ జనరేట్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీశాఖలో ముఖ్యంగా పన్ను వసూలు, మిషన్ భగీరథ తాగునీటిపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. పన్నుల వసూలు వేగవంతం చేయాలని తెలిపారు. మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంకులు సకాలంలో తప్పనిసరిగా శుభ్రం చేసి నీటి శాంపిల్స్‌ను ఎప్పటికప్పుడు ల్యాబ్స్‌కు పంపించాలన్నారు. తద్వారా సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చన్నారు. శానిటేషన్ చేపట్టాలని సూచించారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ-2025 వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో జడ్పీ సీఈవో రమేశ్, డీఆర్డీవో జయదేవ్ ఆర్య, డీపీవో దేవకీదేవి, పంచాయతీ రాజ్ ఈఈ లు శ్రీనివాస్ రెడ్డి, చిరంజీవులు పాల్గొన్నారు.