హత్నూర, జూన్ 28 : ఓ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జిన్నారం సీఐ నయీముద్దీన్ హత్నూర పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ శ్రీధర్‌రెడ్డితో కలిసి హత్య కేసు వివరాలను వెల్లడించారు. మండలంలోని కాసాల గ్రామానికి చెందిన ఎరుకల శ్రీను (25), అతడి దూరపు బంధువు దౌల్తాబాద్ గ్రామానికి చెందిన ఎరుకల మల్లేశం ఇద్దరు గతంలో దొంగతనం కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే, ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో ఈ నెల 25న కాసాల శివారులోని ఇప్పలకుంట వద్ద ఎరుకుల శ్రీనుపై మల్లేశం బ్లేడ్‌తో గొంతుకోశాడు. శవాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పోలీసులు గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని గుర్తించారు. మల్లేశంను అదుపులోకి తీసుకొని విచారించడంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దాంతో మల్లేశంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.