Mahavir Phogat : పారిస్ ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన వినేశ్ ఫొగాట్(Vinesh Phogat) రాజకీయాల్లోకి రావడంపై సర్వత్రా చర్చ జరుగతోంది. కుస్తీని వదిలేసిన ఆమె ఈమధ్యే కాంగ్రెస్‌లో చేరారు. దాంతో, ఆమె నిర్ణయాన్ని తోటి రెజ్లర్లు కొందరు తప్పు పడుతున్నారు. తాజాగా ఆమె మేనమామ మహవీర్ ఫొగాట్ (Mahavir Phogat) సైతం అదే అభిప్రాయం వెలిబుచ్చాడు. నాలుగేండ్ల తర్వాత లాస్ ఏంజెల్స్‌లో జరుగబోయే ఒలింపిక్ పతకంపై వినేశ్ గురి పెట్టాల్సింది. అలాకాకుండా ఆమె రాజకీయాల్లోకి రావడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా అని మహవీర్ అన్నాడు.
‘వినేశ్ తీసుకున్ని నిర్ణయం నాకు నచ్చడం లేదు. ఆమె ఒలింపిక్ పతకంపై గురి పెట్టాల్సింది. ఈ తరం పిల్లలు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే.. అది వాళ్ల అభీష్టం. నా బాధ్యత ఏంటంటే.. వాళ్లకు మంచి తర్ఫీదు ఇవ్వడమే. ప్రస్తుతం వినేశ్ ఫొగాట్ వయసు చూస్తే.. మరో ఒలింపిక్స్‌కు సిద్ధం కావాల్సింది. అందుకని వినేశ్ రాజకీయాల్లోకి రావడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా’ అని మహవీర్ తెలిపాడు.
అంతేకాదు బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా వినేశ్ మళ్లీ ఆందోళన చేపట్టనుందా? అనే ప్రశ్నకు ఆయన .. ఆ ఉద్యమం అనేది ఒక వ్యక్తికి సంబంధించినది. అయితే.. అందుకు రాజకీయాలతో పని లేదు అని ఆయన స్పష్టం చేశారు. వినేశ్‌ను ఒలింపిక్ చాంపియన్‌గా చూడాలనే తన కల ఇక నెరవేరదనే బాధ మహవీర్లో కనిపిస్తోంది.
విశ్వక్రీడల్లో మహిళల 51 కిలోల రెజ్లింగ్ వినేశ్ ఉడుం పట్టుతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. దాంతో, రెజ్లింగ్‌లో పసిడి లేదా రజతం గెలిచిన తొలి మహిళగా చరిత్ర సృష్టించడం ఖాయమని యావత్ భారతం అనుకుంది. ఆమె ఫైనల్ మ్యాచ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూశారు.
కానీ, వంద గ్రాముల అదనపు బరువుతో వినేశ్‌పై అనర్హత వేటు పడింది. ఆ విషయం తెలియగానే అయ్యో.. వినేశ్‌కు ఎంత అన్యాయం జరిగింది అని కోట్లాది మంది కంటతడి పెట్టుకున్నారు. ఆ సమయంలో మహవీర్ వినేశ్‌కు సంఘీభావం తెలిపాడు. ‘ఈ ఒలింపిక్స్ కాకుంటే వచ్చే ఏడాది చూసుకుందాం. బాధ పడకు బిడ్డా’ అని కొండంత ధైర్యం చెప్పాడు. అంతేకాదు పతకం చేజారిన బాధలో రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికిన ఆమె నిర్ణయాన్ని వాపస్ తీసుకునేలా చేస్తానని కూడా మహవీర్ అన్నాడు.
కానీ, వినేశ్ భారత్‌లో అడుగుపెట్టాక ఆయన అంచనాలు తప్పాయి. విమానాశ్రయంలో హర్యానా కాంగ్రెస్ నేత ఆమెకు ఘన స్వాగతం పలకారు. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే వినేశ్ కాంగ్రెస్‌లో చేరాలనే నిర్ణయానికి వచ్చింది. సాటి రెజ్లర్ భజ్రంగ్ పూనియా(Bajrang Punia)తో కలిసి ఆమె కాంగ్రెస్ కండువా మెడలో వేసుకుంది. అనంతరం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని సైతం కలిసింది.