Zaheer Khan : ఐపీఎల్ 18వ సీజన్ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటికే కసరత్తులు మొదలెట్టాయి. కొత్త హెడ్కోచ్లతో పాటు బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌ల ఆధ్వర్యంలో కప్పు కొట్టాలనే కసితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) కూడా కొత్త మెంటర్ కోసం అన్వేషిస్తోంది. వెటరన్ పేసర్ జహీర్ ఖాన్ (Zaheer Khan)తో ఆ పోస్ట్‌ను భర్తీ చేయాలని లక్నో ఫ్రాంచైజీ భావిస్తోంది. ఈ విషయమై జహీర్‌తో చర్చలు కూడా జరుపుతోంది. ఒకవేళ అన్నీ కుదిరితే ఈ వరల్డ్ కప్ హీరో లక్నో జట్టుకు మెంటర్ అవ్వడం ఖాయం.
భారత జట్టు పేసర్లలో అగ్రగణ్యుడైన జహీర్ ఖాన్ 2011 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం అతడు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు బౌలింగ్ కోచ్‌గా సేవలందించాడు. ఐపీఎల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న జహీర్ ఈమధ్య టీమిండియా బౌలింగ్ కోచ్‌గా ఎంపికవుతాడనే వార్తలు వినిపించాయి.
అయితే.. గంభీర్ మాత్రం మొండి పట్టుతో మోర్కెల్‌ను తన టీమ్‌లో చేర్చుకున్నాడు. దాంతో, జహీర్‌కు చాన్స్ దక్కలేదు. అందువల్ల ఈ యార్కర్ కింగ్‌ను తమ మెంటర్‌గా నియమించుకోవాలని లక్నో పావులు కదుపుతోంది. ప్రస్తుతం లక్నో కోచింగ్ సిబ్బందిలో జస్టన్ లాంగర్(హెడ్‌కోచ్), ఆడమ్ వోజెస్, లాన్సే క్లుసేనర్, జాంటీ రోడ్స్(ఫీల్డింగ్ కోచ్)లు ఉన్నారు.
టీమిండియా తరఫున జహీర్ 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20లు ఆడాడు. ఇక ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్లు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఐపీఎల్లో 100 మ్యాచ్‌లతో సెంచరీ కొట్టాడు.