అమరావతి : మారుతున్న కాలానికి అనుగుణంగా వివాహ వ్యవస్థలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లి చూపుల నుంచి కడవరకు సాగే ప్రయాణాన్ని కలకాలం గుర్తుండిపోయేలా ప్లాన్‌ను తయారు చేసుకుంటున్నారు. ఎంగేజ్‌మెంట్‌ను అచ్చం పెళ్లి మాదిరిగా చేసుకోవడం, సుందర లోకేషన్ల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి తమకు నచ్చిన విధంగా ఫొటో, వీడియో వెడ్డింగ్ షూట్లు జరుపుకుంటున్నారు.
పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామానికి చెందిన టీచర్ ప్రత్యూష(Teacher Prathyusha) కూడా తన వివాహం రోటిన్‌గా కాకుండా కొంచెం భిన్నంగా ఉండే విధంగా ప్లాన్ వేసుకుంది. ఆమె ఈనెల 23న వరుడు పణీంద్రతో వివాహం చేసుకోబోతుంది. అచ్చం ప్రశ్నపత్రంలా (Question paper) వెడ్డింగ్ కార్డును తయారు చేసి పంపిణీ చేసింది.
వెడ్డింగ్ కార్డు మొత్తం 8 క్వొశ్చన్లతో కూడిన పేపర్ మాదిరిగా ముద్రించి బంధు,మిత్రులకు పంచి పెట్టింది. మొదటి ప్రశ్నగా ‘ఐడెంటీ ద పర్సన్ ఈజ్ ద పిక్చర్’ అంటూ వరుడు ఫొటోతో క్వొశ్చన్ వేస్తునే ఆన్సర్ వరుడు పణీంద్ర అంటు జవాబు నింపింది. రెండో ప్రశ్నగా ప్రత్యూష ఇంగ్లిష్ పదంలో తప్పులను సరిచేయాలని సూచిస్తూనే కరెక్ట్ పదాన్ని వెడ్డింగ్ కార్డులో పొందుపరిచింది.
వరుడు తల్లిదండ్రుల పేర్లు, కన్యదాతల పేర్లు, కళ్యాణ వేదిక , సమయాన్ని కూడా తనదైన శైలీలో రూపొందించడం సోషల్ గ్రూప్‌లో వైరల్‌గా మారింది . పంతులమ్మ రూపొందించిన వెడ్డింగ్ కార్డు వినూత్నంగా ఉండడం పట్ల ఆమెను పలువురు అభినందిస్తున్నారు.