Arvind Kejriwal | మద్యం పాలసీ సీబీఐ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మంగళవారం పొడిగించింది. గతంలో కస్టడీని ముగియడంతో సీబీఐ ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచింది. ఈ సందర్భంగా కోర్టు కస్టడీని ఈ నెల 27 వరకు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులు వెలువరించారు. ఈ నెల 14న కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. అరెస్టు సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ స్పందన కోరింది.
కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. సీబీఐ ఆయనను అరెస్టు చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో ట్రయల్ కోర్టు నుంచి రెగ్యులర్ బెయిల్ కోసం ఆశ్రయించాలని సూచించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 21న ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జూన్ 20న మనీలాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఆదేశాలపై హైకోర్టు మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో జులై 14న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.