Lovnlina Borgohain : ఒలింపిక్ విజేత లొవ్లీనా బొర్గొహెయిన్ (Lovnlina Borgohain) తన కలను సాకారం చేసుకోబోతోంది. అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న లొవ్లీనా త్వరలోనే బాక్సింగ్ అకాడమీని ప్రారంభించనుంది. తమ ప్రాంతంలోని యువ బాక్సర్లకు ప్రపంచ స్థాయి వసతులతో కూడిన మెరుగైన శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆమె గువాహటిలో కొత్త కోచింగ్ సంస్థను మొదలు పెట్టనుంది. ఈ అకాడమీని మంగళవారం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sarma) ప్రారంభించున్నారు.
‘ఈ అకాడమీ ఒక శిక్షణ కేంద్రం మాత్రమే కాదు. దీంతో నా కల సాకారం అవ్వడమే కాదు నేను చేసిన వాగ్దానం కూడా నెరవేరనుంది. బాక్సింగ్ రింగ్‌లో అడుగుపెట్టాలనుకుంటున్న ఎందరో యువతీ యువకులకు శిక్షణ ఇవ్వాలనుకున్న నా కోరిక త్వరలోనే నిజం కాబోతున్నది’ అని టోక్యో విశ్వ క్రీడల్లో కాంస్యతో మెరిసిన లొవ్లీనా వెల్లడించింది.
#Olympic bronze medalist Lovlina Borgohain is set to open the doors to the #Lovlina #Boxing Academy in #Guwahati on June 3, aiming to train and support the next generation of Indian boxers. https://t.co/F3vg7lFk01
— India Today NE (@IndiaTodayNE) June 1, 2025
‘లొవ్లీనా బాక్సింగ్ అకాడమీ ద్వారా యువ అథ్లెట్లలో నైపుణ్యం పెంచాలనే నా స్వప్నం ఫలించనుంది. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలనేది నా లక్ష్యం. మా అకాడమీలో బాక్సింగ్‌తో పాటు వాళ్లకు క్రమశిక్షణ అలవర్చడం, ప్రశాంతంగా ఉండడం, విజయానికి అవసరమైన మెలకువలు అబ్బుతాయి. ఇందులోని ప్రపంచ స్థాయి వసతులు వాళ్లు దీటుగా రాణించడంలో సాయపడుతాయి’ అంటోందీ ఛాంపియన్.
టోక్యో విశ్వ క్రీడల్లో లొవ్లీ 69 కిలోల విభాగంలో కంచు మోత మోగించింది. తద్వారా విజేందర్ సింగ్, మేరీ కోమ్ల తర్వాత బాక్సింగ్‌లో దేశానికి కాంస్యం అందించిందీ యువకెరటం. ప్రస్తుతం 75 కిలోల విభాగానికి మారిన తను.. లాస్ ఏంజెల్స్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో పతకంపై కన్నేసింది.