Gamblers | ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంగీత్ శోభన్ ఇప్పుడు తన ప్రధాన పాత్రలో గ్లాంబ్లర్స్ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఎప్పుడో విడుదల కావలసిన ఈ చిత్రాన్ని ఇప్పుడు థియేటర్స్‌లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్స్ జోరుగా చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. నాలుగు రోజుల క్రితం టీజర్, ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసారు. తాజాగా ట్రైలర్ ను ఆవిష్కరించారు.’ఆడటం చేతగాని వాడికి జూదం అంటే నేరం అనిపిస్తుంది.. ఆడటం తెలిసిన వాడికి జూదం నేరం కాదు ‘ అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్ లో ఒక క్లబ్ లో జరిగే సన్నివేశాలను చూపించారు.
ఇందులో కొందరు వ్యక్తులు క్లబ్ లో గేమ్ ఆడటం, హీరో వాళ్ళతో ఏదో డీల్ సెట్ చేసుకోవడం, దాని వెనుక ఇంకేదో మిస్టరీ ఉందని అనుకునేలా ఈ ట్రైలర్ ఉంది.ఈ చిత్రంలో మిస్టరీతో పాటు ఎంటర్టైన్మెంట్ దండిగా ఉంటుందని అర్ధమవుతుంది. మ్యాడ్, ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాల్లో కామెడీతో ఆకట్టుకున్న సంగీత్ శోభన్.. గ్యాంబ్లర్స్ అనే చిత్రంలో చాలా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. కౌబాయ్ తరహా కాస్ట్యూమ్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ప్రశాంతి చారులింగా, రాకింగ్ రాకేష్, పృథ్వీరాజ్, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్, మల్హోత్త్ర శివ, శివారెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, మధుసూదన్ రావు తదితరులు ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషించారు.
ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో శ్రీవల్లి అనే సైన్స్ ఫిక్షన్ సినిమాను నిర్మించిన నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్ బృందావనంలు రేష్మాస్ స్టూడియోస్, స్నాప్ అండ్ క్లాప్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేఎస్కే చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. పూర్తి వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించగా, ఈ చిత్రం చిత్రం అన్ని వర్గాలను అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 6న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.