Virat Kohli : సెలెబ్రిటీలు, క్రికెటర్లు ఎక్కడైనా కనిపిస్తే చాలు ఫొటోలు తీసేందుకు కెమెరావాళ్లు పరుగులు పెడుతారు. అయితే.. కొన్నిసార్లు వాళ్ల ప్రవర్తన ప్రముఖులకు చిరాకుగా అనిపిస్తుంది. దాంతో, అప్పుడప్పుడు ఫొటోగ్రాఫర్లను సున్నితంగా మందలిస్తారు. తాజాగా భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli )కి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది.
ముంబై విమానాశ్రయంలో కుటుంబ సమేతంగా కోహ్లీ కెమెరా కంట పడ్డాడు. ఇంకేముంది అందరూ చుట్టుముట్టి ఫొటోలు తీయడం మొదలెట్టారు. దాంతో, కోహ్లీ ‘నా భార్య బిడ్డలను ఫొటోలు తీయకండి’ అని వాళ్లకు కాస్త గట్టిగానే చెప్పాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
స్వదేశంలో న్యూజిలాండ్ సిరీస్ ముగియడంతో కోహ్లీ మళ్లీ లండన్‌కు బయలుదేరాడు. భార్య అనుష్కా శర్మ, కూతరు వామికా, బాబు అకాయ్‌లతో కలిసి అతడు ముంబై విమానాశ్రయం చేరుకున్నాడు. అక్కడ కోహ్లీని కెమెరాలో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు పోటీ పడ్డారు. మరికొద్దరు అనుష్క, వామికా, అకాయ్‌లను ఫొటో తీసేందుకు ప్రయత్నించారు. దాంతో, ఇబ్బందిగా ఫీలైన కోహ్లీ ఫొటోగ్రాఫర్లను మందలించాడు. అటు వైపు కెమెరా తిప్పకండి అని వాళ్లతో అన్నాడు.
కివీస్‌తో మూడు టెస్టు సిరీస్‌లో విఫలమైన కోహ్లీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమవుతున్నాడు. గత ఐదేండ్లలో రెండే రెండు టెస్టు సెంచరీలు బాదిన విరాట్‌కు ఈ సిరీస్ చాలా కీలకం. భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాలంటే కచ్చింతగా ఆస్ట్రేలియాను ఓడించాల్సిందే. అందుకని అనుభవజ్ఞుడైన కోహ్లీ కంగారూల గడ్డపై పరుగుల వరద పారించడం చాలా ముఖ్యం. అలాకాకుండా అతడు నిరాశపరిచాడంటే బహుశా ఇదే ఆఖరి సిరీస్ కావొచ్చు అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
అయితే.. ప్రత్యర్థి ఎంతగా కవ్విస్తే.. అంతగా రెచ్చిపోయే కోహ్లీ కొదమసింహంలా తన బ్యాట్ పవర్ చూపిస్తాడని తెలిసిందే. ఈసారి కూడా ఆసీస్‌పై కోహ్లీ అదే తీరుగా చెలరేగి ఆడాలని కోట్లాది అభిమానులు ఆశ. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు ఆడనుంది. ఇరుజట్ల మధ్య నవంబర్ 22వ తేదీన పెర్త్‌లో తొలి టెస్టు జరుగనుంది.