జగిత్యాల: జగిత్యాలలో (Jagtial) పెళ్లింట విషాదం చోటుచేసుకున్నది. వధువు తల్లిదండ్రులు రిసెప్షన్ ముగించుకుని ఇంటికి తిరిగెళ్తుండగా.. వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె అన్న, మరో యువతి మృతిచెందగా, తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాల పట్టణంలోని హనుమాన్ వాడకి చెందిన రాయమల్లు తన కూతురిని హనుమకొండకు చెందిన యువకుడితో వివాహం చేశారు.
శనివారం రాత్రి హనుమకొండలో వారి రిసెప్షన్‌కు హాజరయ్యారు. అర్ధరాత్రి తర్వాత తన భార్య, కుమీరుడు సంకీర్త్, అతని స్నేహితురాలి రాజీతో కలిసి జగిత్యాలకు కారులో తిరిగి పయణమయ్యారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై ధరూర్ వద్ద.. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి జగిత్యాలకు డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సును ఢీకొట్టింది.
దీంతో సంకీర్త్, రాజీ అక్కడికక్కడే మృతిచెందారు. వెనుక సీట్లో కూర్చున్న రాయమల్లు, అతని సతీమణి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.