Virat Kohli : ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతున్న వేళ దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత సైన్యం శత్రుదేశం పాకిస్థాన్ డ్రోన్లను గాల్లోనే కూల్చేస్తూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూస్తోంది. ఈ నేపథ్యంలో యావత్ దేశం ఆర్మీకి మద్ధతుగా నిలుస్తోంది. ప్రాణాలకు తెగించి మరీ దాయాది వ్యూహాల్ని నీరుగారుస్తున్న సైనికుల ధైర్యసాహసాలను పలువురు పొగుడుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తన సంఘీభావం తెలియజేశాడు.
‘భారత ఆర్మీకి సెల్యూట్. మీ ధైర్య సాహసాలకు రుణపడి ఉంటాం. శుత్రువుల ఎత్తులను చిత్తు చేస్తున్న మీకు యావత్ భారతం వెన్నంటి ఉంటుంది అని విరాట్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ‘భారత్, పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వేళ మన సైన్యం అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శిస్తోంది. ఈ కష్ట సమయంలో మన ఆర్మీ యోధులు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు.
అందుకే.. సైన్యానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. అందరి తరఫున ఆర్మీకి మద్ధతు, హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేశం కోసం సైనికులు, వాళ్ల కుటుంబసభ్యులు చేసే త్యాగాలు భారత్‌ను గొప్ప దేశంగా మారుస్తున్నాయి. జై హింద్’ అని కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించాడు.
సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున పలువురు ఆటగాళ్లు భారత సైన్యానికి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ప్రతిఒక్కరు దేశానికి మద్దతుగా నిలవాలని, సహనాన్ని పాటిస్తూ అధికారులు సూచించే భద్రతా జాగ్రత్తలు పాటించాలని భారత జట్టు వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ దేశ ప్రజలను కోరాడు. హిట్‌మ్యాన్ మాదిరిగానే కోహ్లీ సైతం సైన్యానికి సంఘీభావం తెలుపుతూ.. ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని విన్నవించాడు.
ఐపీఎల్ 18వ సీజన్లో అర్ధ శతకాలతో చెలరేగుతున్న కోహ్లీ.. ఆర్సీబీ తొలి టైటిల్ కలను సాకారం చేయాలనే కసితో ఉన్నాడు. అయితే.. గురువారం ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు చేసిన బీసీసీఐ వారం రోజుల పాటు ఐపీఎల్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. దేశం కంటే ఏదీ ఎక్కువ కాదని చెప్పిన బీసీసీఐ పరిస్థితులు చక్కబడ్డాక ఐపీఎల్ తదుపరి మ్యాచ్‌లకు కొత్త షెడ్యూల్ ప్రకటించనుంది.