సూర్యాపేట, ఫిబ్రవరి 23 : తన తండ్రి ద్వారా సంక్రమించిన భూమికి బేస్మెంట్ కడుతున్న క్రమంలో పక్క భూమికి చెందిన మాద వెంకన్న అనే వ్యక్తి తమ భూమి పైకి వచ్చి దాడికి పాల్పడ్డాడని, ఈ విషయమై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని అధికారులు స్పందించి తనకు రక్షణ కల్పించాలని బాధితురాలు కొండ మమత కోరారు. సోమవారం సూర్యాపేటలోని మానసా నగర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు వెంట ఉన్న తన భూమి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె తన గోడు వెళ్లబోసుకున్నారు. సర్వే నెంబర్ 798లో తన తండ్రి రాపర్తి చెన్నయ్యకు ఉన్న 605 గజాల భూమిని పసుపు కుంకుమ కింద ఇవ్వగా అందులో 485 గజాలు రిజిస్ట్రేషన్ అయిందన్నారు. ఆ భూమిలో తాము హద్దులు ఏర్పాటు చేసుకునేందుకు బేస్మెంట్ కడుతుండగా పక్క భూమికి చెందిన మాద వెంకన్న కుటుంబం తమ భూమి పైకి వచ్చి వారి భూమి తమకు చెందిన భూమిలో కలిసిందంటూ తనపై దౌర్జన్యం చేస్తూ దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయమే తాను కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చానని దాన్ని లెక్కచేయకుండా తమ భూమిపైకి వచ్చి తమపైనే దాడి చేస్తున్నారన్నారు. మాద వెంకన్నకు చెందిన భూమి పక్కనే ఉన్న పోలీసు అధికారి సోమనారాయణ దాంట్లో కలిసిందని, ఆ విషయం వెంకన్నకు కూడా తెలుసన్నారు. ఆయన పోలీసు కావడంతో ఆయనను అడగలేక తమ భూమిపైకి వచ్చి ఇబ్బందుల పాలు చేస్తున్నాడన్నారు. ఈ విషయమై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మాద వెంకన్న కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులు, అధికారులు స్పందించి తగిన విచారణ చేసి తనకు రక్షణ కల్పించాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు.