IND vs SL : పొట్టి సిరీస్‌లో శ్రీలంకను వైట్ వాష్ చేసిన భారత జట్టు వన్డే సిరీస్‌లో బోణీ చేసే చాన్స్ కోల్పోయింది. విజయానికి ఒక్క పరుగు అవసరమైన వేళ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను టైగా ముగించింది. స్వల్ప ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ(58) హాఫ్ సెంచరీతో కదం తొక్కగా.. కేఎల్ రాహుల్(31, అక్షర్ పటేల్(33)లు సాధికారక ఇన్నింగ్స్ ఆడారు. ఆఖర్లో శివం దూబే(25) తన స్టయిల్లో చెలరేగాడు. విజయానికి ఒక్క పరుగు అవసరమైన వేళ చరిత అలసంక(3/30) మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. వరుస బంతుల్లో దూబై, అర్ష్‌దీప్ సింగ్(0)లను ఎల్బీగా వెనక్కి పంపాడు. అంతే మమ్యాచ్ టైగా ముగిసింది.
లంక నిర్దేశించిన స్వల్ప ఛేదనను ఓపెనర్ రోహిత్ శర్మ(58) ధాటిగా ఆరంభించాడు. అరంగేట్ర పేసర్ మహ్మద్ షిరాజ్, స్పిన్నర్ దునిత్ వెల్లలాగే బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మూడో ఓవర్ తొలి బంతికే ఎల్బీగా ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న రోహిత్ మరింత రెచ్చిపోయాడు. 33 బంతుల్లోనే అర్థ శతకం బాదడంతో టీమిండియా పవర్ల ప్లేలో వికెట్ కోల్పోకుండా 71 రన్స్ చేసింది. టీమిండియా స్కోర్ బుల్లెట్టులా ఉరికింది.
భారత ఇన్నింగ్స్ జోరుగా సాగుతున్న వేళ దునిత్ వెల్లలాగే లంకకు తొలి బ్రేక్ ఇచ్చాడు. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(16)ను ఎల్బీగా ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ(24), శ్రేయస్ అయ్యర్(23)లు విఫలమయ్యారు. 132కే ఐదు వికెట్లు పడిన జట్టును కేఎల్ రాహుల్(31), అక్షర్ పటేల్(33)లు ఆదుకున్నారు. వీళ్లిద్దరూ లంక స్పిన్నర్లు సమర్ధంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ నిర్మించారు. ఐదో వికెట్‌కు 57 పరుగులు జోడించి జట్టును గెలుపు బాట పట్టించారు.
Things went down to the wire in Colombo as the match ends in a tie!
On to the next one.
Scorecard ▶️ https://t.co/4fYsNEzggf#TeamIndia | #SLvIND pic.twitter.com/yzhxoyaaet
— BCCI (@BCCI) August 2, 2024
అయితే.. రాహుల్‌ను ఔట్ చేసిన హసరంగ లంకకు బ్రేకిచ్చాడు. ఆ కాసేపటికే అసలంక(330) అక్షర్ పోరాటాన్నిముగించాడు. ఆ తర్వాత వచ్చిన శివం దూబే(25) ధనాధన్ ఇన్నింగ్స్‌తో విజయసమీకరణాన్ని మార్చేశాడు. అసలంక వేసిన 48వ ఓవర్ మూడో బంతిని బౌండరీకి పంపి స్కోర్ సమం చేశాడు. ఒక్క రన్ కొడితే విజయమే అనుకున్న వేళ నాలుగో బంతికి దూబే ఎల్బీగా ఔటయ్యాడు. ఆ తర్వాత బంతికే అర్ష్‌దీప్ సింగ్(0) సైతం ఎల్బీగా దొరికిపోయాడు. అంతే.. క్షణాల వ్యవధిలోనే గెలుస్తుందనుకున్న టీమిండియా టైతో సరిపెట్టుకుంది.
టాస్ గెలిచిన ఆతిథ్య జట్టుకు సిరాజ్ షాకిస్తూ.. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(1)ను వెనక్కి పంపాడు. 7 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన లంకను ఓపెనర్ పథుమ్ నిశాంక(52), కుశాల్ మెండిస్(14) ఆదుకునే ప్రయత్నం చేశారు. రెండో వికెట్‌కు 39 రన్స్ జత చేసిన ఈ జోడీని శివం దూబే విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన సదీర సమరవిక్రమ, కెప్టెన్ చరిత అసలంక(14)లు నిరాశపరిచారు.
ఓ వైపు వికెట్లు పడుతున్న నిశాంక అద్భత ఆర్థ శతకంతో జట్టును ఆదుకున్నాడు. 101 పరుగుల వద్ద అతడు ఔటయ్యాక యువ ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలాగే(67 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. జనిత్ లియాంగె(20), వనిందు హసరంగ(24)లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లను దీటుగా ఎదుర్కొన్న వెల్లలాగే వన్డేల్లో తొలి అర్ధ శతకం బాదాడు. అకిల ధనంజయ(17)తో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించాడు. జట్టు స్కోర్ 200 దాటించి పరువు కాపాడాడు. చివరి ఓవర్ దాకా వెల్లలాగే ధాటిగా ఆడడంలో లంక 230 పరుగులకు పరిమితమైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు.