కరువుకు ఊరు వలస పోయింది. అన్నం పెట్టని మగ్గం వదలిపెట్టిన ఆమె కుట్టు మిషన్ నేర్చింది. డ్వాక్రాలో అప్పు తెచ్చి ఇల్లు నెట్టుకొచ్చింది. మిత్తీ తక్కువే అయినా కిస్తీలు కట్టాల్సిందే. అందుకోసం బ్యాగులు, పర్సులు, కవర్లు కుట్టడం మొదలుపెట్టింది. చూస్తుండగానే.. ఆమె తయారు చేసిన ఉత్పత్తులు రాష్ర్టాలు దాటాయి. ఇప్పుడు పదికిపైగా దేశాల్లో అమ్ముడవుతున్నాయి. ఒంటరిగా మొదలైన ఆమె ప్రయాణంలో ఇప్పుడు 300 మందికిపైగా చేరారు. అంతమందికి ఉపాధి చూపుతూ, మన చేనేత కళకు గుర్తింపు తీసుకొచ్చింది వర్కాల విజయలక్ష్మి. ఇల్లు, పిల్లలు, వ్యాపారం చేస్తూ నడి వయసులో చదువు మొదలుపెట్టింది! పరదేశీ భాషలు నేర్చి వ్యాపారాన్ని ఖండాంతరాలు దాటించిన విజయలక్ష్మి గెలుపు కథ ఇది.
నేను పదో తరగతి ఫెయిల్ అయిన. మావాళ్లు పెళ్లి చేశారు. మా మామ, మా ఆయన నేత పని చేసేది. నేను, మా అత్త నూలు తిప్పడం, చిట్కీలు కట్టడం, ఆసు పోయడం లాంటివి చేసేవాళ్లం. అప్పట్లో వానలు పడక, పంటలు పండక కరువొచ్చింది. చేయనీకి పనుల్లేకుండా పోయాయి. మా చేనేత పని కూడా తగ్గింది. బతకనీకి ఎటు దారి దొరికితే అటు పోయినరు. నేత పని చేసేటోళ్లు ఎక్కువమంది హైదరాబాద్‌లో వాచ్‌మెన్‌గా, అడ్డా కూలీలుగా, హమాలీలుగా.. పనికి కుదిరినరు. ఆ కరువు కాలంలో ఉన్నప్పుడు తినుకుంట, లేనప్పుడు పస్తులుంట మేం ఊళ్లనె ఉన్నం.
పాతికేళ్ల కింద.. స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ వాళ్లు మా ఊరికి వచ్చినరు. పైసల్లేకుండ టైలరింగ్ నేర్పిస్తమన్నరు. మా ఊరు యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడం నుంచి ముప్పై మంది అందుల చేరినం. ఎంబ్రాయిడరీ వర్క్ నేర్పించినరు. టైలరింగ్ కూడా నేర్పినరు. సమభావన పొదుపు సంఘం (డ్వాక్రా) లో చేరి పొదుపు చేసినం. నాగార్జున గ్రామీణ బ్యాంక్ లోన్ ఇచ్చింది. ఆ రుణానికి నెల నెలా కిస్తీలు కట్టనీకి టైలరింగ్ మొదలుపెట్టిన. మొదాట్ల చేనేత బ్యాగులు, పర్సులు కుడుతుంటి. మా కొయ్యలగూడెం చేనేతకు ప్రసిద్ధి. చాలామంది విదేశీయులు మా ఊరికి వచ్చేటోళ్లు. చేనేత సొసైటీ ఆఫీసు మా ఇంటి ముందే ఉండేది. సొసైటీ ఆఫీస్‌కి వచ్చిన విదేశీయులు నేను కుట్టిన బ్యాగులు, పర్సులు చూసి ముచ్చటపడి కొనుక్కున్నరు. అట్ల వాటికి డిమాండ్ పెరిగింది. చేనేత డిజైన్లు, రంగులు బాగుంటయి కాబట్టి జనం వీటిని ఆదరించినరు.

అయిదారు నెలలు ఒక్కదాన్నే చేశాను. డీఆర్డీఏ అధికారులు నా బ్యాగులు, పర్సులు, కవర్లు హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్‌కి తీస్కపోయారు. అవన్నీ అమ్ముడయ్యాయి. ఆ తర్వాత డీఆర్డీఏ వాళ్లే లెటర్ ఇచ్చి ఢిల్లీ, ముంబయికి పంపించినరు. ఎగ్జిబిషన్లకు పోవాల్నంటె ఒక్కదాన్నే కుట్టిన మెటీరియల్ బ్యాగులు, పర్సులు, కవర్లు సరిపోయేది కాదు. రామానంద తీర్థ వాళ్లు మా ఊళ్లో ఆరు నెలలపాటు వరుసగా చాలా బ్యాచ్‌లకు టైలరింగ్ నేర్పించినరు. దాదాపు మా ఊళ్లో మూడు వందల మంది దాకా టైలరింగ్ నేర్చుకున్నారు. దాంతో వాళ్లందరికీ మెటీరియల్ సప్లయ్ చేసి కుట్టుపని ఇచ్చిన. వాళ్లంతా బ్యాగులు, డ్రెస్‌లు కుట్టి ఇచ్చేవాళ్లు. సోఫా కవర్లు, పిల్లో కవర్లు, ఫ్రిజ్ కవర్లు, టేబుల్ టాప్స్ ఇట్ల రకరకాల మోడల్స్ కుట్టినం. మా ఊరిలో డబుల్ ఇక్కత్ చేనేతతో చేసిన బ్యాగులు, పర్సులు, కవర్లకు ఎక్కడికి పోయినా మంచి డిమాండ్ వచ్చేది! ఇండియాలో ఉన్న అన్ని స్టేట్లకు పోయి వాటిని ప్రదర్శించిన.
బ్యాగులు, కవర్లు పెద్ద మొత్తంలో కుట్టిస్తున్న. వాటి తయారీ కోసం క్లాత్ అవసరం పెరిగింది. మా ఊరిలో మగ్గం నేసేటోళ్లని కలిసి దారం ఇచ్చి క్లాత్ వేయించిన. అట్ల ఒకప్పుడు పని లేనోళ్లకు పని చూపిచ్చిన. ఇప్పుడు వంద మగ్గాలు నేను నడిపే బిజినెస్ కోసమే పని చేస్తున్నయ్. నా చేతికింద వంద మంది నేత కార్మికులే కాదు రెండు వందల మంది లేడీ టైలర్లు పని చేస్తున్నరు. ఇంత మంది కష్టానికి గుర్తింపు వచ్చింది. అవకాశాల కోసం తిరగని దేశం లేదు. అమెరికా, మలేషియా, శ్రీలంక, ఇటలీ, బంగ్లాదేశ్, చైనా వెళ్లొచ్చా.
అమెరికాలో మనవాళ్లు ఏడుంటే అక్కడ మా ఉత్పత్తులు అమ్మిన. న్యూయార్క్, అట్లాంటా, న్యూ జెర్సీ.. ఇట్ల ఇరవై స్టేట్లకు పోయిన. ఆటా, నాటా వాళ్లు పిలిచి మరీ స్టాల్ పెట్టించినరు. మన సంస్కృతి, మన సంప్రదాయాల కోసం వాళ్లు చూపిన ప్రేమ అంత గొప్పది. విదేశాల్లో ఉన్నవాళ్ల కోసం బ్లౌజులు, కుర్తాలు, పైజామాలు, లేడీస్ టాప్స్, పిల్లల దుస్తులు, చీరలు కూడా కుట్టిస్తాను. చీర పల్లూకి ఇక్కత్ వర్క్‌ని మోడిఫై చేయిస్తా. ఇక్కత్ చీరలపై పెన్ కలంకారీ, హ్యాండ్ వర్క్, ప్యాచ్‌లు వేయిస్తాను. చీరను మోడ్రన్‌గా ధరించేటట్టు తయారు చేసి ఇస్తున్నం.
మొదట్ల నాకు తెలుగు తప్ప వేరే భాష వచ్చేది కాదు. ఇతర రాష్ర్టాలకు వెళ్లడం మొదలైనాంక హిందీ నేర్చుకున్న. హిందీ వస్తే దేశమంతా తిరిగి రావొచ్చు. నేనొక్కదాన్నే ఎక్కడ ఎగ్జిబిషన్ ఉన్నా పోయి వస్తున్న. అట్లనే కొంచెం ఇంగ్లిష్ నేర్చుకున్న. బిజినెస్ మంచిగ నడుస్తున్నది. చదువు ఉంటే ఉపయోగం అనిపించింది. ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ, బిజినెస్ చేసుకుంటూ పదో తరగతి పరీక్ష రాసి పాసైన. తర్వాత డిస్టెన్స్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీకామ్ చదివిన. ట్రేడ్ లైసెన్స్‌లు తెచ్చుకోవడానికి, ట్యాక్సులు కట్టడం, పర్మిషన్లకు చదువు ఉపయోగపడ్డది. చదువు వల్ల ఒకరి సాయం లేకుండా విదేశాలకు పోయి వస్తున్నా. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చైనా పర్యటనకు పోతే, ఆమెతోపాటు నన్ను కూడా పంపించారు. ఎలీఫ్, ఈఎస్ఏ, నార్త్ అమెరికా పద్మశాలీ అసోసిఊయేషన్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాకు బెస్ట్ ఉమెన్ ఆంత్రప్రెన్యూర్ అవార్డులు ఇచ్చాయి.
మా అత్తమామలు చేనేత పని మీద ఏమీ సంపాదించలేదు. మేమే కొంచెం కష్టపడి బాధల్ని గట్టెక్కించాం. ఈ బిజినెస్ వల్లే సంపాదించుకున్నం. మంచి ఇల్లు కట్టుకున్నాం. ముగ్గురు పిల్లలను సదివించుకున్నాం. పెద్దమ్మాయిని సివిల్స్‌కి ప్రిపేర్ చేయించిన. మొన్న గ్రూప్ వన్ ఆఫీసర్ ఉద్యోగం సాధించింది. ఎంపీడీవో అయింది. చిన్నమ్మాయి మైక్రోసాఫ్ట్‌లో జాబ్ చేస్తున్నది. కొడుకు ఒక మల్టీ నేషనల్ కంపెనీలో సాప్ట్వేర్
ఇంజినీర్ జాబ్ చేస్తున్నాడు.
– వర్కాల విజయలక్ష్మి
– నాగవర్ధన్ రాయల