‘పల్లెలకు కథానాయకులు మీరే.. సమష్టి కృషితో ప్రగతిని పరుగులు పెట్టించాలి.. ఎవరు బెదిరించినా భయపడాల్సిన అవసరం లేదు.. బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అంతా అండగా ఉంటుంది’ అని కొత్త సర్పంచులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు. జనగామలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాలులో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యుల అభినందన, ఆత్మీయ సమ్మేళనానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘గ్రామాభివృద్ధి కోసం కష్టపడాలి.. ఓట్లు వేసిన వారితో పాటు వేయని వారి ఇళ్లకు సైతం గెలిచినోళ్లు, ఓడిపోయినోళ్లు వెళ్లి కృతజ్ఞతలు చెప్పాలి.. ప్రజా క్షేత్రంలో ఉండి సేవలందించాలని’ కేటీఆర్ హితబోధ చేశారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో గెలిచిన బీఆర్ఎస్ బలపరిచిన ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించి విధులు, బాధ్యతలు, విధానాలపై దిశానిర్దేశం చేశారు.
– జనగామ, నమస్తే తెలంగాణ, జనవరి6
కేసీఆర్ పదేళ్ల ప్రభుత్వంలో గొప్పగా పనిచేశామని, పల్లెలను ప్రగతిబాట పట్టించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. పచ్చటి పల్లెలు తయారు కావాలని హరితహారంలో మొక్కలు నాటించి వాటిని బతికించాలన్న ఉద్దేశంతో ప్రతి ఊరికి ట్యాంకర్లు పెట్టి నీళ్లు పో శామని చెప్పారు. రాష్ట్రంలో 270కోట్ల మొక్కలు నాటించిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు. కాంగ్రెస్ వచ్చినంక చెత్త తీసేందుకు ఏర్పాటు చేసి న ట్రాక్టర్లకు డీజిల్ పోసే దిక్కులేదని, హరితహా రంలో నాటిన మొక్కలకు నీళ్లు పట్టే నాధుడు లేడని, వీధిలైట్లు లేక గ్రామాల్లో అంధకారంలో మగ్గుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనంతో ఎప్పుడూ లేని విధంగా రైతులు అరిగోస పడుతున్నారని ధ్వజమెత్తారు.
ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా గత కేసీఆర్ ప్రభు త్వం అమలు చేసిన పథకాలను కూడా కొనసాగించలేని దుస్థితిలో కాంగ్రె స్ ప్రభుత్వం ఉందన్నారు. కేవలం దోచుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రభుత్వంలో ఎవరికీ ఎలాంటి బాధ్యత కనిపించడం లేదని కేటీఆర్ దుయ్యబట్టారు. ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ప్రాజెక్టులపై కేసీఆర్ అడిగి న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆపసోపాలు పడుతున్నారని, ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్‌రెడ్డి లాగు తడుస్తుందని అన్నారు. నదీ జలాల పై ముఖ్యమంత్రికి ఏమాత్రం అవగాహన లేదని, ఇక మంత్రుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాల దెబ్బ తో రేవంత్‌రెడ్డి ఉక్కిరిబిక్కిరయ్యాడన్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఊర్లో చెప్పుకోదగ్గ సీట్లు కూడా కాంగ్రెస్ గెలువలేదు..కానీ మ నం అధికారంలో లేకపోయినా..కేసీఆర్‌పై ఉన్న నమ్మకం, ఆయా ప్రాంతా ల్లో ఉన్న నాయకులపై ప్రేమతో జిల్లాలో 155 స్థానాలు గెలిచి ‘జనగామ గులాబీ అడ్డా’ నిరూపించిన కార్యకర్తలు, నాయకులు, ఓటర్లకు కృతజ్ఞత లు చెబుతున్నా అని కేటీఆర్ అన్నారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కారుగుర్తు మీద ఎవరు వచ్చినా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలె. కేసీఆర్ మళ్లీ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో అందరం పనిచేద్దాం. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఎవరికీ బీఫామ్ ఇస్తే వాళ్లలోనే కేసీఆర్‌ను చూడాలె. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే కారు గుర్తుతో ఎవరు మీ ముందుకు వస్తారో వారినే గెలిపించాలె అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Ktr
కాంగ్రెస్ ప్రభుత్వంలో గూండా రాజ్యం..
సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసులు ఇంటికి వస్తున్నరు.. పిల్లలను బెదిరిస్తున్నరు.. ఒక్కో మాటను బూతద్దంలో దేవులాడి ఎవరిని ఎట్ల ఒత్తాలి.. ఎట్ల ఇబ్బంది పెట్టా లి.. ఇవ్వాళ కాంగ్రెస్ ప్రభుత్వం గూం డా రాజ్యం నడుపుతున్నదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిడ్డా జాగ్రత్త.. మీరు మర్చిపోతున్నరు.. ఇది ఓరుగల్లు ఇక్కడ పౌరుషం ఉన్న పోరు బిడ్డలు ఉంటరు.. చాకలి ఐలమ్మ, షేక్‌బందగీ, దొడ్డి కొమురయ్య, సర్వాయిపాపన్న పుట్టిన గడ్డ ఇది.. రాణీరుద్రమ.. సమ్మక్కసారమ్మ పుట్టిన ఈ గడ్డ మీద ఉడుత ఊపులకు ఎవడూ భయపడడని ఆ హౌలాగాడు రేవంత్‌రెడ్డి తెలుసుకోవాలి అని అన్నారు. హౌలాగాడు అని ఉత్తగనే అంటలేను.. నేను సోయిలో ఉండే అంటున్న.
ఈ సీఎంకు అఆలు.. ఇఈలు తెల్వదు.. అడ్డిమారి గుడ్డిదెబ్బల పేమెంట్ కోటాలో ఢిల్లీకి నెలకు రూ.100 కోట్లు కడుతనని ఒప్పందంతో రాహుల్‌గాంధీకి మూటలు మోస్తున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, వరంగల్ మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నన్నపునేని నరేందర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగు రాకేశ్‌రెడ్డి, గద్దల నర్సింగరావు, సెవెల్లి సంపత్, పల్లా సుందర్‌రాంరెడ్డి, బక్క నాగరాజు, మాజీ మున్సిపల్, మాజీ మార్కెట్ చైర్మన్లు గాడిపెల్లి ప్రేమలతా రెడ్డి, పోకల జమున, బండ పద్మ యాదగిరిరెడ్డి, బాల్దె విజయ సిద్ధిలింగం, ఇర్రి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సగానికి పైగా సర్పంచ్‌లను గెలిపించుకున్నం : మాజీ మంత్రి ఎర్రబెల్లి
దేవరుప్పుల : ‘గతంలో జనగామ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయానికి కేటీఆర్ వచ్చిన సమయంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్‌లను బీఆర్ఎస్ పక్షాన గెలిపిస్తామని తాను, పల్లా, తాటికొండ కేటీఆర్‌కు మాట ఇచ్చాం.. నేడు ఆ మాట నిలబెట్టుకుని జిల్లాలో 150 సర్పంచ్ స్థ్ధానాలను కైవసం చేసుకున్నాం. అధికార పార్టీ నాయకుల బెదిరింపుల వల్ల కొన్ని చిన్న గ్రామాల్లో ఓడాం. మరికొన్ని గ్రామాలు కొద్ది తేడాతో పోయాయి. ఆ రోజు కేటీఆర్ రాక పార్టీ శ్రేణుల్లో ఒకింత ఉత్సాహాన్ని నింపింది.
దాని ఫలితం సర్పంచ్ ఎన్నికల్లో కనిపించింది. నేడు సర్పంచ్ల ఆత్మీయ సన్మాన సభకు కేటీఆర్ రావడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీలను గెలిపించి కేటీఆర్‌కు కానుకగా అందిస్తాం. బిడ్డా కడియం శ్రీహరి.. మున్సిపల్ ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి. నేనొస్తా.. ప్రచారం చేస్తా.. నీ చరిత్ర ప్రజలకు చెబుతా. ఉన్నత పదవులు అనుభవించి.. పార్టీ మారిన నీకు స్టేషన్‌ఘన్‌పూర్ ప్రజలే బుద్ధి చెబుతారు. తాను, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కలిసి జనగామను జిల్లా చేయాలని పట్టుబడితే కడియం అడ్డుపుల్ల వేసిన మాట నిజం కాదా? చివరకు స్టేషన్ఘన్పూర్ను మున్సిపాలిటీ చేద్దామన్నా ఆయనే అడ్డుపుల్ల వేశాడు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది.
ఎన్నికలేవైనా గెలుపు బీఆర్ఎస్దే : ఎమ్మెల్యే పల్లా
జనగామ : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జనగామ, చేర్యాల ము న్సిపాలిటీలపై గులాబీజెండా ఎగురవేస్తాం. ఎన్నికలు ఏవైనా.. అవి ఎప్పుడొచ్చినా కేసీఆర్, కేటీఆర్ ఉద్యమ స్ఫూర్తితో జనగామ ని యోజకవర్గంలోని అన్ని మండల పరిషత్‌లను బీఆర్ఎస్ గెలుచుకుంటుంది. 2001 నుంచి ఇప్పటి వరకు చేర్యాల, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ప్రాంతాలు గులాబీ పార్టీకి అండగా నిలిచాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనగామ, స్టేషన్‌ఘన్‌పూ ర్ ప్రజలు కేసీఆర్, కేటీఆర్‌కు అండగా నిలిచారు. సర్పంచ్ ఎన్నికల్లో నిర్భందాలు, పోలీసు కేసులు, ఒత్తిళ్లు, బెదిరింపులకు తట్టుకొని నిలబడి కలబడి గులాబీ సైనికులు గెలిచారు. వచ్చే ఎన్నికల్లో కూడా కేసీఆర్, కేటీఆర్ అండతో ధైర్యంగా ముందుకువెళ్లి విజయం వైపు దూసుకుపోతాం. స్టేషన్‌ఘన్ పూర్ మున్సిపాలిటీ కాకుండా అడుగడుగునా అడ్డుపడ్డది కడియం శ్రీహరి అనే విషయాన్ని పట్టణ ప్రజలకు చెప్పి ఆ మున్సిపాలిటీపై జెండా ఎగురవేయాలి.
ప్రభుత్వం ఇస్తున్న అరకొర యూరియా బస్తాలతో పంటలు పండ క రైతులు ఇప్పటికే నష్టపోయారు. రానున్న రోజుల్లో మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఆనాడు మున్సిపల్ మంత్రి జనగామ పట్టణానికి రూ.30 కోట్లు, చేర్యాలకు రూ.15 కోట్ల నిధులిస్తే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ చేతగాని నాయకులు అక్కడ అభివృద్ధికి అడ్డుపడితే.. ఏదో విధంగా నెట్టుకొస్తున్నాం. మళ్లీ మూడేళ్లకు వచ్చే బీఆర్ఎస్ సర్కార్‌లో మీరే మున్సిపల్ మంత్రిగా అవుతారు కాబట్టి.. జనగామను సిరిసిల్లతో దీటుగా చేయాలని.. గతంలో సిద్ధిపేట, గజ్వేల్ మోడల్ అభివృద్ధి అనే చెప్పేవాళ్లం..ఇప్పుడు జనగామ, చేర్యాలను సిరిసిల్ల మాదిరిగా మీరే చేయాలని, చేనేత కార్మికుల సమస్యలు ప్రస్తావించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కేటీఆర్ దృష్టికి తెచ్చారు.

కేసీఆర్‌ను తిడితే పుట్టగతులుండవు
– ఎమ్మెల్సీ పోచంపల్లి
బచ్చన్నపేట : తెలంగాణ సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయక పోరు చేసి రాష్ట్రం సాధించిన కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లు తిడితే ఊరుకోం. ఎన్నో ఏండ్ల తెలంగాణ ఏర్పాటు కల నెరవేర్చిన మహానేత కేసీఆర్‌ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పుట్టగతులుండవు. ఇక చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ నా కొడుకులను ఉరికిచ్చి కొట్టుడు ఖాయం. క్రమశిక్షణకు మారుపేరైన బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ ఓపికతో ఉంటున్నారు. వారు సహనం కోల్పోకముందే రేవంత్ మాటలు తగ్గించుకోవాలి.
కేసీఆర్ తెలంగాణ తేకపోతే సీఎం రేవంత్ కుర్చీలో కూర్చునే అర్హత దక్కేనా? ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని అన్యాయంగా కేసీఆర్‌ను తిడుతుంటే రక్తం మరిగిపోతుంది. బీఆర్ఎస్ నేతలను ఎవరన్న ఒక మాట అనాలంటే భయం పుట్టేలా సోషల్ మీడియాలో కౌంటర్లు ఇవ్వాలి. నవతరం నాయకుడు కేటీఆర్. కేసీఆర్ సారథ్యంలో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం. ఆబద్ధాలతో ఆధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ రెండేళ్లలోనే పూర్తిగా విఫలమైంది. జనగామ జిల్లాలో మెజార్టీ శాతం గులాబీ పార్టీ సర్పంచ్‌లను గెలిపించి కేటీఆర్‌కు కానుకగా ఇచ్చాం. ఎమ్మెల్సీ నిధుల నుంచి జనగామ జిల్లాకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. రేపు జరుగబోయే స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, చేర్యాల మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేస్తాం.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ధ్వజం
తెలంగాణ సాధనలో పాత్ర లేకున్నా పెద్ద నాయకుడు అనుకుంటున్న కడియం శ్రీహరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఉపముఖ్యమంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, బిడ్డకు ఎంపీ టికెట్ ఇప్పించుకొని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తట్టపార పారేసి రేవంత్‌రెడ్డి సంకలో చేరిండు అని కేటీఆర్ విమర్శించారు. పెద్దపెద్ద నాయకులు జారుకున్నా.. ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మంది పో యినా..నిబద్ధతతో పనిచేసిన మా కార్యకర్తలందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందం చేస్తున్నానని అన్నారు. నాయకుడు పారిపోయినా కార్యకర్తలే కథానాయకుడై గ్రామాల్లో ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ లాగా విజృంభించి.. ఏమైనయ్ మీ ఆరు గ్యారెంటీలు..? మీ 420 హామీలు.. అని కాంగ్రెస్ నాయకులను గల్లబట్టి నిలదీయాలి. 150 మంది సర్పంచ్‌లను గెలిపించుకోవడం అంటే ఇది మీ విజ యం తప్ప.. ఇక్కడ వేదికపై కూర్చున్న వారిది కాదని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీని తగలబెట్టే నిప్పుకణిక కేటీఆర్ : రాజయ్య
దేవరుప్పుల : రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని తగలబెట్టి నామరూపాలు లేకుండా చేసే నిప్పు కణిక కేటీఆర్. కేటీఆర్ రాకతో బీఆర్ఎస్ పార్టీ రీచార్జ్ అయింది. ప్రతి ఒక్క కార్యకర్త రగులుతున్నాడు. ఏ ఎన్నిక వచ్చినా గెలుపు గులాబీనే వరిస్తుంది. అది మున్సిపాలిటీ అయినా, స్టేషన్‌ఘన్‌పూర్ ఉప ఎన్నిక అయినా, మరేదైనా గెలుపు బీఆర్ఎస్ పక్షాన నిలుస్తుంది. కడియం లాంటి ద్రోహులకు స్థానం లేకుండా చేద్దాం. బీఆర్ఎస్ పార్టీని పునర్నిర్మాణం చేసి కేసీఆర్ తిరిగి సీఎం అయ్యే వరకు అలుపెరుగని పోరాటం చేద్దాం.
కరువును జయించిన కేసీఆర్ : ముత్తిరెడ్డి
బచ్చన్నపేట : జనగామ నియోజకవర్గానికి సాగు, తాగునీరు కరువు లేకుండా చేసిన మహానేత కేసీఆర్. క్రమశిక్షణకు మారుపేరు బీఆర్ఎస్ పార్టీ. అందుకే కేసీఆర్ చెప్పగానే జనగామ సీటును వదులుకుని పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఇచ్చి ఆయనను గెలిపించుకున్నాం. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఒక్క కేసీఆర్ మాటతో పక్కకు తప్పుకున్నా. ఏళ్ల తరబడి కరువుతో అల్లాడిన బచ్చన్నపేట మండలాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. సబ్బండ కుల, చేతి వృత్తులను ఆదరించడం వల్లనే వారంతా ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ముఖ్యంగా నేడు హైదరాబాద్ అభివృద్ధిని చూసి దేశ, విదేశీయులు ముక్కున వేలేసుకుంటున్నారు. దీన్ని బట్టి కేసీఆర్, కేటీఆర్ హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో ఆర్థం చేసుకోవాలి. జనగామ జిల్లాలో ఎలాంటి విభేదాలు లేకుండా అంతా కలిసి బీఆర్ఎస్ విజయానికి పాటుపడుతాం.