సర్పంచులు పీఠాన్ని అధిరోహించి 15 రోజులు దాటినా ఇంకా చేతికి చెక్”పవర్’ రాలేదు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సర్పంచ్, ఉప సర్పంచులకు కలిపి జాయింట్ చెక్ పవర్ ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇవ్వకుండా తీవ్ర తాత్సారం చేస్తున్నది. ప్రత్యేక పాలన సమయంలో పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రత్యేకాధికారికి జాయింట్ చెక్‌పవర్‌ను ఇచ్చిన ప్రభుత్వం.. దాన్ని బదలాయించాల్సి ఉంది. ఇందుకోసం బ్యాంకులో సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకాలతోపాటు ఆధార్, పాన్‌కార్డు, ఫోన్ నంబర్, వేలిముద్రల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగడంలేదు. పేరుకుపోయిన పల్లె సమస్యలను పరిష్కరించేందుకు కొత్త సర్పంచులు చెక్”పవర్’ కోసం ఎదురుచూస్తున్నారు.
-అశ్వారావుపేట, జనవరి 6
భద్రాద్రి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో కొలువుదీరిన కొత్త పాలకవర్గాలకు చెక్‌పవర్ ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. దీంతో సర్పంచులు దిక్కులు చూస్తున్నారు. ఫలితంగా పల్లెల్లో పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతోపాటు అభివృద్ధి పనులు సైతం ముందుకు సాగడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయకపోవడంతో పంచాయతీల బ్యాంకు ఖాతాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వసూలు చేసిన పన్నులతో స్వల్పకాలిక సమస్యలు పరిష్కరిద్దామన్నా చెక్”పవర్’ లేకపోవడంతో సర్పంచులు చేతులెత్తేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 22 మండలాల్లో మొత్తం 471 పంచాయతీలకు గాను కొన్ని అనివార్య కారణాలతో 3 పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు.
మిగతా 468 పంచాయతీల్లో కొత్తపాలక వర్గాలు పక్షం రోజుల క్రితం కొలువుదీరాయి. గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు పూర్తయిన వెంటనే ఎన్నికలు నిర్వహించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లపాటు ప్రత్యేకాధికారులతో పాలన సాగించింది. పాలకవర్గాలు లేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాకపోవడంతో పల్లెల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. నిధులు లేక ప్రత్యేకాధికారులు మొఖం చాటేశారు. గత్యంతరం లేక పంచాయతీ కార్యదర్శులే తమ జేబులోని డబ్బులు పెట్టి, వ్యాపారుల నుంచి వడ్డీలకు తెచ్చి మరీ ఖర్చు చేశారు. ఆలస్యంగా ఎన్నికలు నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గెలిచిన పాలకవర్గాలతో డిసెంబర్ 22న ప్రమాణ స్వీకారోత్సవాలు చేయించింది. ఇప్పటికే 15 రోజులు గడుస్తున్నా ఇంకా సర్పంచ్, ఉప సర్పంచులకు చెక్‌పవర్ ఇవ్వలేదు. చెక్ పవర్ రావాలంటే గ్రామ పంచాయతీ అకౌంట్ ఉన్న బ్యాంకులో సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకాలతోపాటు ఆధార్, పాన్‌కార్డు, ఫోన్ నెంబర్, వేలిముద్రల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
చెక్‌పవర్ కోసం సర్పంచ్‌లు, ఉప సర్పంచులు ఎదురుచూస్తున్నారు. కొన్నిచోట్ల కొత్త సర్పంచులు ఇప్పటికే అభివృద్ధి పనుల కోసం సొంత డబ్బును వెచ్చిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెక్‌పవర్ విషయంలో ఆదేశాలు లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, జిల్లా అధికారుల నాన్చుడు ధోరణి చూస్తుంటే పంచాయతీలకు చెక్‌పవర్ అందడానికి మరికొంత ఆలస్యమయ్యేట్లు కనిపిస్తున్నది. ఎన్నికల ఖర్చులను భరించిన సర్పంచులు ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం కొత్తగా అప్పులు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. గత సర్పంచుల బిల్లులు ఇంకా కొంత పెండింగ్‌లోనే ఉండటంతో అప్పులు చేసేందుకు ససేమిరా అంటున్నారు.
పేరుకుపోయిన సమస్యలు..
గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి ఎలా ఉన్నా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు చిల్లిగవ్వ కూడా లేక కొత్త పాలకవర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. పంచాయతీలను నిధుల కొరత వెంటాడుతుండడంతో సర్పంచులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ రోజూవారీ వ్యయం భారంగా మారింది. చెత్త సేకరణకు కొనుగోలు చేసిన ట్రాక్టర్లు చాలా పంచాయతీల్లో మరమ్మతులకు గురై మూలనపడ్డాయి. వీటిని బయటకు తీసే దారి కూడా కనిపించక దిక్కులు చూస్తున్నారు.
చెక్‌పవర్ ఇవ్వలేదు..
బాధ్యతలు చేపట్టి పక్షంరోజులు అవుతోంది. ప్రభుత్వం ఇంకా చెక్‌పవర్ ఇవ్వలేదు. గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. పంచాయతీలో నిధులు లేవు. వాటికి లెక్కా పత్రం కూడా లేదు. దీనిపై త్వరలోనే పాలకవర్గాన్ని సమావేశపరిచి ఒక నిర్ణయం తీసుకోవాలని ఆలోచనలో ఉన్నాం.
-సోడెం భారతి, సర్పంచ్, కేశప్పగూడెం
సమస్యలు దర్శనమిస్తున్నాయి..
ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుకాక గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే దర్శనమిస్తున్నాయి. అప్పులు తీసుకొచ్చి పనులు చేయించే పరిస్థితులు లేవు. గత సర్పంచులు పెండింగ్ బిల్లుల కోసం పడుతున్న ఇబ్బందులను చూస్తునే ఉన్నాం. నిధులు వస్తేనే పనులు చేయగలం. ఇంతవరకు చెక్‌పవర్ కూడా ఇవ్వలేదు.
-పండా రాజు, సర్పంచ్, దిబ్బగూడెం
త్వరలోనే చెక్ పవర్ ఇస్తాం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల ఎన్నికైన సర్పంచులకు త్వరలోనే చెక్ పవర్ అందిస్తాం. ఇప్పటికే సర్పంచ్, ఉప సర్పంచ్ల స్పెసిఫిక్ సిగ్నేచర్లు సేకరిస్తున్నాం. అవి అందిన వెంటనే చెక్ పవర్ జారీ చేస్తాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా అందాయి.
-సుధీర్‌కుమార్, ఇన్చార్జి డీపీవో, భద్రాద్రి