Praveen Kumar | ప్రవీణ్‌కుమార్.. భారత్ క్రికెట్ ఆణిముత్యం. ఆడింది కొన్ని మ్యాచ్‌లే కానీ అతని ప్రతిభ అద్భుతం. బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే అసమాన నైపుణ్యం కల్గిన ప్రవీణ్‌కుమార్.. ఎక్కువ రోజులు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేకపోయాడు. ఆడినన్ని రోజులు తన స్వింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన ఈ ఉత్తరప్రదేశ్ క్రికెటర్.. అనారోగ్య సమస్యలతో కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టాల్సి వచ్చింది. ఎవరూ ఊహించని రీతిలో టీమిండియాకు కీలక బౌలర్‌గా సేవలందించిన ప్రవీణ్‌కు గాయాలకు తోడు అనారోగ్య సమస్యలు కెరీర్ కొనసాగించేందుకు ప్రతిబంధకంగా మారాయి.
2007లో పాకిస్థాన్‌పై భారత్ తరఫున అరంగేట్రం చేసిన ప్రవీణ్ వెనుదిరిగి చూసుకోలేదు. తన స్వింగ్ మాయాజాలంతో వికెట్ల వేట కొనసాగిస్తూ తురుపుముక్కలా తయారయ్యాడు. కానీ పరిస్థితులు పగపట్టాయి. దక్షిణాఫ్రికా పర్యటనలో భుజం గాయానికి గురైన ప్రవీణ్‌కుమార్.. 2011లో స్వదేశం వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో చోటు దక్కించుకుంటాడని అందరూ ఊహించారు. కానీ దురదృష్టం నీడలా వెంటాడింది. భుజం గాయం తిరుగతోడటం, అదే సమయంలో డెంగ్యూ జ్వరం రావడంతో మెగాటోర్నీలో ప్రవీణ్ బెర్తు దక్కించుకోలేకపోయాడు.
అయితే కొన్ని రోజుల వ్యవధిలో తిరిగి ఫుల్ ఫిట్నెస్తో జట్టులోకి వచ్చిన ప్రవీణ్‌కుమార్.. బుమ్రా లాంటి యువ పేసర్లతో తీవ్ర పోటీ ఏర్పడింది. సరైన అవకాశాలు రాక 2018లో ప్రవీణ్.. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అయితే 2012-17 మధ్య కాలంలో ఈ స్వింగ్‌స్టర్ తీవ్ర మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొన్నాడు. ఒక రోజు తన ఇంటి నుంచి తుపాకీతో బయటికి వచ్చి తనకు తాను కాల్చుకుని చనిపోయేందుకు ప్రయత్నించాడు. టీమింఇండియా తరఫున ప్రవీణ్‌కుమార్.. ఆరు టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 27 వికెట్లు, వన్డేల్లో 77 వికెట్లు, టీ20ల్లో 8 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
SatwikSairaj | ఫార్ములా వన్ కార్ కంటే ఫాస్ట్‌గా స్మాష్.. గిన్నిస్ రికార్డుకెక్కిన సాత్విక్