SatwikSairaj | ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు తీసే షాంఘై మాగ్లెవ్ రైలు గరిష్ట వేగం గంటకు 460 కిలోమీటర్లు!
వేగానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఫార్ములా వన్ కార్ టాప్ స్పీడ్ గంటకు 372.6 కిలోమీటర్లు!
టెన్నిస్ చరిత్రలో ఇప్పటి వరకు నమోదైన అత్యంత వేగవంతమైన సర్వ్ గంటకు 263 కిలోమీటర్లు!
క్రికెట్లో షోయబ్ అక్తర్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ బాల్ రికార్డు గంటకు 161.3 కిలోమీటర్లు!
వీటన్నింటినీ తోసిరాజంటూ.. బ్యాడ్మింటన్‌లో తెలుగు కుర్రాడు తన వేగంతో గిన్నిస్ రికార్డుల్లోకెక్కాడు. ఇండోర్ గేమ్‌గా ముద్రపడ్డ షటిల్లో ఈ అమలాపురం కుర్రాడు కొట్టిన స్మాష్ ముందు బుల్లెట్ ట్రైన్ వేగం సైతం చిన్నబోయింది. గంటకు 565 కిలోమీటర్ల వేగంతో స్మాష్ కొట్టిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్.. దశాబ్ద కాలం నాటి రికార్డును బద్దలు కొట్టి నయా చరిత్ర లిఖించాడు.
సోకా (జపాన్): అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత స్టార్ డబుల్స్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్.. అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచంలోనే వేగవంతమైన స్మాష్ తన పేరిట లిఖించుకున్నాడు. గంటకు 565 కిలోమీటర్ల వేగంతో షాట్ కొట్టిన సాత్విక్.. పదేండ్ల కిందటి రికార్డును బద్దలు కొడుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. పురుషుల విభాగంలో ఇప్పటి వరకు 2013లో మలేషియన్ షట్లర్ టాన్ బూన్ హియాంగ్ (గంటకు 493 కిలోమీటర్లు) కొట్టిన షాట్ వేగవంతమైందిగా నిలువగా.. దశాబ్ద కాలం తర్వాత దాన్ని తెలుగు కుర్రాడు తిరగరాశాడు. మహిళల విభాగంలో టాన్ పీర్లే గంటకు 438 కిలోమీటర్ల వేగంతో స్మాష్ కొట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. పురుషుల డబుల్స్‌లో చిరాగ్ శెట్టితో కలిసి వరుస విజయాలు సాధిస్తున్న సాత్విక్ సాయిరాజ్.. ఇటీవల ఇండోనేషియా ఓపెన్ సూపర్-1000 టోర్నీ గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ‘పురుషుల విభాగంలో సాత్విక్, మహిళ విభాగంలో టాన్ పీర్లే వేగవంతమైన స్మాష్‌లతో గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నారు. వారికి అభినందనలు. పురుషుల విభాగంలో 2013 నుంచి కొనసాగుతున్న రికార్డును సాత్విక్ తిరగరాశాడు’అని యోనెక్స్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ 14న గిన్నిస్ ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రదర్శన నమోదైనట్లు వెల్లడించింది.
సింధు కోచ్‌గా హఫీజ్ హాషిమ్
గాయం నుంచి తిరిగి కోలుకున్న అనంతరం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. మంగళవారం తన కొత్త కోచ్‌ను పరిచయం చేసింది. వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరుగనున్న ఒలింపిక్స్ కోసం ఇండోనేషియాకు చెందిన మహమ్మద్ హఫీజ్ హాషిమ్ వద్ద శిక్షణ తీసుకోనున్నట్లు ఈ తెలుగమ్మాయి వెల్లడించింది. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ అయిన హాషిమ్‌ను ఎంచుకునేందుకు గల కారణాలను సింధు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీని కోసం సాయ్ నుంచి అనుమతి తీసుకున్నట్లు సింధు పేర్కొంది.
దశాబ్దకాలం తర్వాత..
నిరుడు బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన అనంతరం మరో మేజర్ టైటిల్ నెగ్గలేకపోయిన పీవీ సింధు.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ర్యాకింగ్స్లో 17వ స్థానానికి పరిమితమైంది. గత దశాబ్ద కాలంలో ఈ తెలుగమ్మాయికి ఇదే అత్యల్ప ర్యాంక్ కావడం గమనార్హం. 2013 జనవరిలో 17వ ర్యాంక్‌లో నిలిచిన సింధు.. ఆ తర్వాత నిలకడగా రాణిస్తూ.. తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. గతేడాది వరకు టాప్-10లో కొనసాగిన సింధు తాజా ప్రదర్శనతో తన ర్యాంక్‌ను చేజార్చుకుంది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ అత్యుత్తమంగా 10వ ర్యాంక్‌లో ఉండగా.. పురుషుల డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ జంట మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది.
ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్ జోడీ
కొరియా ఓపెన్‌లో భారత డబుల్స్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీ పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జంట 21-16, 21-14తో జామ్కో-కెడ్రెన్ జోడీపై నెగ్గి ముందంజ వేసింది. ప్రపంచ మూడో ర్యాంక్‌లో ఉన్న భారత జంట తొలి రౌండ్లో వరుస గేమ్‌ల్లో విజృంభించి విజయం సాధించింది. గత నెలలో ఇండోనేషియా ఓపెన్ నెగ్గిన అనంతరం బరిలోకి దిగిన తొలి టోర్నీలో మనవాళ్లు దుమ్మురేపారు. ముఖ్యంగా చిరాగ్ నెట్ గేమ్‌తో ఆకట్టుకుంటే.. సాత్విక్ తన సూపర్ స్మాష్‌లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు.