Joe Root : ఇంగ్లండ్ క్రికెట్ బోర్డకు కొత్త తలనొప్పి మొదలైంది. జోస్ బట్లర్ వారసుడి ఎంపికపై ప్రతిష్టంభన నెలకొంది. వైట్ బాల్ కెప్టెన్ పదవిపై పలువురు సీనియర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జో రూట్జా (Joe Root)తీయ జట్టు పగ్గాలు చేపట్టేందుకు తాను సిద్ధంగా లేనని వెల్లడించాడు.
‘ఇంగ్లండ్‌కు టెస్టుల్లో సారథిగా వ్యవహరించాను. ఇక మళ్లీ కెప్టెన్సీ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ముఖ్యంగా వన్డే, టీ20 జట్లకు అస్సలు నాయకుడిగా ఉండాలని అనుకోవడం లేదు. అయితే.. కొత్త కెప్టెన్ ఎవరు అయినా సరే వాళ్లు నిజంగా గర్వపడతారు’ అని రూట్ తెలిపాడు. దాంతో.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
ఇయాన్ మోర్గాన్ నుంచి 2022లో కెప్టెన్సీ అందుకున్న జోస్ బట్లర్ తన మార్క్ చూపలేకపోయాడు. వన్డే వరల్డ్ కప్‌లో ఓటమి.. ఈమధ్యే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అతడి నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు ఘోరంగా విఫలమైంది. ఈ టోర్నీలో వైఫల్యం తర్వాత జోస్ బట్లర్ కెప్టెన్‌గా తప్పుకున్నాడు. దాంతో, వైట్ బాల్ సారథిగా సమర్థుడైన ఆటగాడిని నియమించాలని ఈసీబీ భావిస్తోంది.
ప్రస్తుతానికి డాషింగ్ ఓపెనర్ బెన్ డకెట్, ఆల్‌రౌండర్ లియాం లివింగ్‌స్టోన్‌లు కెప్టెన్సీ చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీళ్లలో ఒకరిని ఎంపిక చేస్తారా లేదంటే టెస్టులు, టీ20ల్లో ఇరగదీస్తున్న హ్యారీ బ్రూక్‌కు బాధ్యతలు అప్పగిస్తారా? అనేది త్వరలోనే తెలియనుంది. ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టుకు మూడు ఫార్మాట్ల కోచ్‌గా సేవలందిస్తున్న బ్రెండన్ మెక్కల్లమ్తో చర్చించి.. సెలెక్టర్లు కొత్త సారథిని ప్రకటిస్తారని సమాచారం.