Joe Root : ప్రపంచ క్రికెట్లో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tenddulkar) ఓ శిఖరం. టెస్టులు, వన్డేల్లో మాస్టర్ బ్లాస్టర్ నెలకొల్పిన రికార్డులు కోకొల్లలు. దాంతో, ఈతరం క్రికెటర్లలో సచిన్ దరిదాపుల్లోకి కూడా ఎవరూ వెళ్లలేరని అంతా అనుకున్నారు. కానీ, ఒకే ఒక్కడు వరుస శతకాలతో సచిన్ రికార్డులను బ్రేక్ చేసేందుకు వస్తున్నాడు. మంచినీళ్లు తాగినంత సులువుగా సెంచరీలు కొట్టేస్తున్నాడు. అతడే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root). సంప్రదాయ క్రికెట్‌కు అధునాతన షాట్లను జోడించి ఆడే రూట్ అనతికాలంలోనే దిగ్గజ ఆటగాడిగా ప్రశంసలందుకున్నాడు. స్వీప్, రివర్స్‌స్వీప్ షాట్లతో బౌలర్ల లయను దెబ్బతీసే రూట్‌కు అర్ధ సెంచరీలను శతకాలుగా మలచడం వెన్నతో పెట్టిన విద్య
క్రీజులోకి రావడమే ఆలస్యం వేరులా పాతుకుపోయే రూట్.. చాపకింద నీరులా పరుగులు రాబట్టడంతో దిట్ట. లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 103 పరుగులతో ఇంగ్లడ్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు కొట్టిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. 2021కి ముందు 17 సెంచరీలతో ఎక్కడో ఉన్న అతడు.. ఇప్పుడు 34వ శతకం బాదేశాడంటే అతడి ప్రతిభ, పట్టుదల ఏపాటివో అర్థమవుతాయి.
The moment Joe Root became England’s leading century-maker in Test cricket 🙌
(via @englandcricket) #ENGvSL pic.twitter.com/aYdBfIxiGG
— ESPNcricinfo (@ESPNcricinfo) August 31, 2024
సుదీర్ఘ ఫార్మాట్లో రారాజుగా వెలుగొందుతున్న రూట్ కెరీర్‌ని 2021కి ముందు 2021 తర్వాత అని చెప్పాల్సి వస్తుంది. అవును ఈ మూడేండ్ల కాలంలోనే ఈ సొగసరి బ్యాటర్ 17 పర్యాయాలు మూడంకెల స్కోర్ చేశాడు. తన సమకాలీకులు ఫ్యాబ్ 4లో ఉన్న స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీలు ఈ కాలంలో 10 సెంచరీలు కూడా కొట్టలేకపోయారు. విలియమ్సన్ 9 శతకాలు బాదగా.. స్మిత్ ఆరు, కోహ్లీ 2 సెంచరీలకే పరిమితం అయ్యారు.
17 tons from 2012 to 2020.
17 tons since the start of 2021.Joe Root, there are no words 🤯 pic.twitter.com/8AQzpfk0FL
— ESPNcricinfo (@ESPNcricinfo) August 31, 2024
కానీ, రూట్ మాత్రం అలవోకగా శతక గర్జన చేస్తూ వాళ్లను దాటేసి టెస్టు క్రికెట్లో యూనివర్సల్ బాస్‌గా అవతరించాడు. అవును.. రూట్ శతకాల దాహంతో దూసుకెళ్తున్నాడు. 34 సెంచరీతో ఇంగ్లండ్ లెజెండ్ అలెస్టర్ కుక్ రికార్డును బ్రేక్ చేసిన ఈ రన్ మెషీన్ ఇక సచిన్ రికార్డులపై గురి పెట్టాడు.
టెస్టుల్లో రూట్ పరుగుల వరద పారిస్తున్న తీరు చూస్తుంటే అత్యధిక పరుగుల వీరుడు అయ్యేలా ఉన్నాడు. ప్రస్తుతం సచిన్ 15,921 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. రూట్ ఖాతాలో 12,377 రన్స్ ఉన్నాయి. మాస్టర్ బ్లాస్టర్ రికార్డ్ బద్ధలు కొట్టేందుకు అతడికి మరో 3,544 పరుగులు కావాలంతే. ఒకవేళ రూట్ మరో రెండేండ్లు ఇదే ఫామ్ కొనసాగిస్తే.. సచిన్‌ను దాటేసి 16 పరుగుల క్లబ్లో చేరడం ఖాయం అంటున్నారు క్రికెట్ పండితులు.