భోపాల్: విషపూరిత దగ్గు మందు వల్ల కిడ్నీలు దెబ్బతినడంతో మధ్యప్రదేశ్‌లో 24 మంది పిల్లలు మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఒక బాలుడు మృత్యువును జయించాడు. (Toxic Syrup Survivor) మూత్రపిండాలు దెబ్బతిన్న ఆ చిన్నారి మూడు నెలలకుపైగా ప్రాణాలతో పోరాడాడు. అయితే ప్రాణాలు దక్కించుకున్నప్పటికీ కంటిచూపు, కదలికను కోల్పోయాడు. చింద్వారా జిల్లాలోని జాతచ్చపర్ గ్రామానికి చెందిన ఐదేళ్ల కునాల్ యదువంశి ఆగస్ట్ 24న జ్వరం, దగ్గుతో బాధపడ్డాడు. డాక్టర్ సూచన మేరకు ‘కోల్డ్రిఫ్’ దగ్గు సిరప్‌ను తల్లిదండ్రులు తాగించారు.
కాగా, ఆ తర్వాత బాలుడు కునాల్ ఆరోగ్యం క్షీణించింది. విషపూరిత దగ్గు మందు వల్ల ఆ చిన్నారి రెండు మూత్రపిండాలు దెబ్బతిన్నట్లు వైద్యపరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. బాలుడి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో ఆగస్టు 30న నాగ్‌పూర్‌కు రిఫర్ చేశారు. ఎయిమ్స్ నాగ్‌పూర్‌తో సహా పలు ఆసుపత్రుల్లో కునాల్‌ను అతడి తండ్రి చేర్చాడు. ఆ బాలుడు బతికే అవకాశాలు చాలా తక్కువ అని డాక్టర్లు చెప్పారు.
మరోవైపు బాధాకరమైన రోజువారీ డయాలసిస్‌ను నెలరోజులపాటు కునాల్‌కు కొనసాగించారు. 115 రోజుల ఇంటెన్సివ్ చికిత్స తర్వాత ఆ బాలుడు మృత్యువును జయించి ఇంటికి తిరిగి చేరుకున్నాడు. అయితే దగ్గు సిరప్ విష ప్రభావం వల్ల కంటిచూపు కోల్పోయాడు. అలాగే నాడీ వ్యవస్థపై ప్రభావం వల్ల సరిగ్గా నడవలేకపోతున్నాడు. అయితే మృత్యువును జయించిన మాదిరిగానే దీర్ఘకాలిక వైద్య సంరక్షణ, పునరావాసంతో ఆ బాలుడి నడక మెరుగుపడవచ్చని డాక్టర్లు, తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.
Also Read:
Watch: రైలులో కాలేజీ అమ్మాయి పట్ల కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన.. తర్వాత ఏం జరిగిందంటే?