Heavy Rains | రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో అతిభారీ వర్షాపాతం నమోదైంది. రాగలరెండురోజులు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో నీటిపారుదలశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, హెడ్క్వార్టర్స్ని విడిచి వెళ్లొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆదేశించారు. నీటి పారుదలశాఖపై ఆయన సమీక్షించారు. వర్షాలు కురుస్తున్న సమయంలో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనుమతి లేకుండా ఇంజినీర్లు హెడ్ క్వార్టర్ని విడిచి వెళ్లొద్దన్నారు.
ప్రతి ఒక్కరూ విధిగా హెడ్ క్వార్టర్లోనే ఉండాలని చెప్పారు. రెడ్ ఎలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఎవరూ సెలవులు పెట్టొద్దని ఆదేశించారు. ఎప్పటికప్పుడు రిజర్వాయర్లు, చెరువులను మానిటరింగ్ చేస్తుండాలని మంత్రి సూచించారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు నీటి స్థాయిలను పర్యవేక్షించాలని.. మరీ ముఖ్యంగా ఓవర్ ఫ్లోని నిరోధించేందుకు ఏట్లు, స్పిల్ వేల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించాలని.. ఎప్పటికప్పుడు డ్యామ్లు, కట్టలు, కెనాల్లను తనిఖీలు చేయాలన్నారు. ప్రమాదం పొంచి ఉందన్న ప్రాంతంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంతకు మించి రైల్వే ఎఫెక్టెడ్ చెరువులపై మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో నీటి పారుదలశాఖ ఇంజినీర్లు వేగంగా స్పందించాలని.. విపత్తులు సంభవిస్తే స్ధానిక అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి ఆదేశించారు.