Instagram : భారత సైనికులు (Indian soldiers) ఇన్స్టాగ్రామ్ (Instagram) వినియోగించడంపై కఠిన వైఖరి అవలంబిస్తూ వస్తున్న భారత రక్షణ శాఖ (Defence ministry).. తాజాగా ఈ నిబంధనలను కాస్త సడలించినట్లు సమాచారం. ఇక నుంచి సైనికులు, సైనికాధికారులు ఇన్‌స్టాగ్రామ్‌ను వీక్షించేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఈ మేరకు రక్షణశాఖ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి. అయితే ఇన్‌స్టా వినియోగానికి అనుమతించినా అందుకు కొన్ని షరతులు కూడా విధించినట్లు తెలుస్తోంది.
తాజా సవరణలకు సంబంధించి అన్ని సైనిక యూనిట్లకు ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ మార్గదర్శకాలు పంపించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. కేవలం సమాచారం తెలుసుకునేందుకు మాత్రమే సైనికులు ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించాలని, పోస్టులు చేయడం, కామెంట్లు పెట్టడం, షేరింగ్, మెసేజ్‌లకు రియాక్ట్ అవడం వంటివి చేయకూడదనే కఠిన ఆంక్షలు మార్గదర్శకాల్లో ఉన్నట్లు తెలిసింది. అంటే సైనికులు ఇన్‌స్టాగ్రామ్‌ను వీక్షించవచ్చు కానీ.. అందులో ప్రతిస్పందించేందుకు అనుమతి ఉండదు. ఇవే నిబంధనలు ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ లాంటి ఇతర మాధ్యమాలకు కూడా ప్రస్తుతం అమల్లో ఉన్నాయి.
సైనికులు, సైనికాధికారులు తమ ఖాతాల్లో తప్పుదోవ పట్టించే పోస్టులు, నకిలీ సమాచారం ఉన్నట్లయితే వాటిని తక్షణమే సీనియర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని రక్షణ శాఖ మార్గదర్శకాల్లో పేర్కొన్నట్లు సమాచారం. వీపీఎన్‌లు, నకిలీ వెబ్సైట్లు, వెబ్ ప్రాక్సీలు వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోను ఉపయోగించవద్దని సైనికులను మరోసారి హెచ్చరించారు. డిజిటల్ అవగాహన, దేశ భద్రత మధ్య సైనికులు సమతూకంగా ఉండాలని ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నట్లు తెలిసింది. సైనికులు సోషల్ మీడియాను వినియోగించడంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయనున్నట్లు డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపిందని మీడియా కథనాల్లో పేర్కొన్నారు.