Yashasvi Jaiswal : భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) విదేశీ పర్యటనల్లో తన ట్రాక్ రికార్డును కొనసాగిస్తున్నాడు. నిరుడు అరంగేట్రంలోనే వెస్టిండీస్ గడ్డపై శతకగర్జన చేసిన ఈ కుర్రాడు.. ఆతర్వాత ఆస్ట్రేలియా, ఇప్పుడు ఇంగ్లండ్ మీద కూడా సెంచరీతో చెలరేగాడు. టెస్టు క్రికెట్లో తన టెక్నిక్, ఆటకు తిరుగులేదని చాటుతూ ఐదో సెంచరీ నమోదు చేశాడు. హెడింగ్లే టెస్టులో 90ల్లోకి వచ్చాక యశస్వీ రెండు చేతుల కండరాలు పట్టేశాయి. అయినా సరే ఫిజియో పరీక్షించిన అనంతరం బ్యాటింగ్ కొనసాగించిన ఈ యంగ్‌స్టర్ టీమిండియా భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఈ యువకెరటం తనకు ప్రతి శతకం ప్రత్యేకమే అంటున్నాడు.
‘నాకు ప్రతి సెంచరీ ప్రత్యేకమే. అందుకే.. నేను మూడంకెల స్కోర్ చేరుకున్న ప్రతిసారి సంతోషంతో గాల్లో తేలిపోతా. నేను సాధించిన శతకాల్లో కొన్ని మరింత స్పెషల్. ఇంగ్లండ్ గడ్డపై తొలి సిరీస్‌లోనే వంద కొట్టడం మర్చిపోలేని అనుభూతి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో బ్యాటింగ్‌ను ఆస్వాదించాను. తొలిరోజు లంచ్‌లోపే రెండు వికెట్లు పడిన తర్వాత.. గిల్, నేను సెషన్ వారీగా సాధ్యమైనన్ని పరుగులు చేసి స్కోర్‌బోర్డును ఉరికించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
No other player than Yashasvi Jaiswal has hundreds in their maiden Tests in the West Indies, Australia and England 🤌 pic.twitter.com/fujLZXAch1
— ESPNcricinfo (@ESPNcricinfo) June 21, 2025
మా ఇద్దరి మధ్య చక్కని సమన్వయం ఉంది. అతడు చాలా ప్రశాతంగా ఉంటాడు. గిల్ అలా కామ్‌గా ఉంటూ ఆడడాన్ని నాన్ స్ట్రయికర్‌గా ఉంటూ ఆస్వాదించాను. తొలి సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లు బౌన్స్‌తో బెంబేలెత్తించాలనుకున్నారు. కానీ, నేను పరిస్థితులకు తగ్గట్టు ఆడడం మీద దృష్టి సారించాను. చెత్త బంతుల్ని బౌండరీకి తరలించాను. కండరాలు పట్టేసినా సరే జట్టును పటిష్ట స్థితిలో నిలపాలనే ఉద్దేశంతో బ్యాటింగ్ కొనసాగించాను. తొలి రోజే 350 ప్లస్ కొట్టడంతో మ్యాచ్‌పై పట్టుబిగించే స్థితిలో నిలిచాం’ అని యశస్వీ వెల్లడించాడు.
శుభ్‌మన్ గిల్(127 నాటౌట్), యశస్వీ(101)
ఇంగ్లండ్ పర్యటనలో భారత కుర్రాళ్లు బ్యాటింగ్ పరీక్షలో విజయం సాధించారు. హెడింగ్లే వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో ఆతిథ్య జట్టు బౌలర్ల స్వింగ్, పేస్‌ను దీటుగా ఎదుర్కొన్న యశస్వీ.. లంచ్ తర్వాత మూడంకెల స్కోర్ సాధించాడు. విదేశాల్లో అతడికిది మూడో టెస్టు శతకం. 92 వద్దే రెండో వికెట్ పడిన వేళ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(127 నాటౌట్)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడీ యంగ్‌స్టర్.
తద్వారా తొలి రోజు టీమిండియా 359 రన్స్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. టీ సెషన్ తర్వాత యశస్వీ ఔటైనా బౌండరీల జోరు తగ్గించని గిల్.. రిషభ్ పంత్(65 నాటౌట్)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ ఇద్దరూ రెండో రోజు తొలి సెషన్లో వికెట్ కాపాడుకుంటే టీమిండియా 500 ప్లస్ కొట్టడం ఖాయం. దాంతో, స్టోక్స్ సేన ఒత్తిడిలో పడే అవకాశముంది.