Neeraj Chopra : భారత ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) మళ్లీ మెరిశాడు. దోహా డైమండ్ లీగ్‌లో నిరాశపరిచిన బడిసె వీరుడు పారిస్ డైమండ్ లీగ్(Paris Diamond League)లో అదరగొట్టాడు. జూలియన్ వెబర్(జర్మనీ)ను రెండోస్థానానికి పరిమితం చేస్తూ టైటిల్ గెలుపొందాడు. జూనియర్ ఈ రెండేళ్లలో అతడు డైమండ్ లీగ్‌లో ఛాంపియన్‌గా నిలవడం ఇదే మొదటిసారి. 2017లో జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌గా ఈ పోటీల్లో పాల్గొన్న చోప్రా.. ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇప్పుడు మాత్రం ఏకంగా టైటిల్ విజేతగా అవతరించి రికార్డులు బద్ధలు కొట్టాడీ భారత స్టార్.
ఈమధ్యే దోహాలో జరిగిన డైమండ్ లీగ్‌లో 90 మీటర్ల మార్క్ అందుకున్న చోప్రా.. శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్లో సత్తా చాటాడు. తొలి రౌండ్లో ఈటెను 88.16 మీటర్ల దూరం విసిరాడు. రెండో రౌండ్లో 85.10 మీటర్లకే పరిమితమైన నీరజ్ తర్వాత మూడు ప్రయత్నాలు ఫౌల్ అయ్యాయి. అయినా సరే ఒత్తిడికి లోనవ్వకుండా ఆఖరిదైన ఆరో రౌండ్లో భారత స్టార్ బడిసెను 82.89 మీటర్ల దూరం విసిరి విజేతగా అవతరించాడు. డైమండ్ లీగ్‌లో 90 మీటర్ల దూరంతో చోప్రాకు షాకిచ్చిన వెబర్ ఈసారి మాత్రం తేలిపోయాడు.
NEERAJ CHOPRA WINS PARIS DIAMOND LEAGUE💎
– The best attempt of 88.16m in first throw 🔥🤩 pic.twitter.com/dhYVQPUr5E
— The Khel India (@TheKhelIndia) June 20, 2025
తొలి రౌండ్లో 87.88 మీటర్ల మార్క్ అందుకున్న అతడు తదుపరి ప్రయత్నాల్లో స్థాయికి తగ్గట్టు రాణించలేదు. వెబర్ రెండో స్థానానికి పరిమితం కాగా.. లూయిజ్ మౌరిసియో డిసిల్వా(బ్రెజిల్) మూడో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఉన్న చోప్రా జూన్ 24న ఒస్ట్రావా(చెక్ రిపబ్లిక్)లో జరుగనున్న గోల్డెన్ స్పైక్స్ అథ్లెటిక్స్‌లో పోటీ పడనున్నాడు. అనంతరం జూలై 5న తన పేరుతో తొలిసారి నిర్వహిస్తున్న నీరజ్ చోప్రా క్లాసిక్ ఎడిషన్‌లో బల్లెం యోధుడు పాల్గొంటాడు.