ఖైరతాబాద్, జూన్ 20: రాజ్ భవన్ ముందు ఓ మహిళ హల్చల్ చేసింది. కార్యాలయం ముందు బైఠాయించి తాను గవర్నర్‌ను కలువాలంటూ పట్టుబట్టిన ఘటన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్ వద్దకు ఓ గుర్తుతెలియని మహిళ చేరుకొని లోనికి వెళ్లేందుకు ప్రయత్నించింది. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో వారిని వారిస్తూ గవర్నర్‌ను కల్పించాలంటూ ప్రాధేయపడింది. వారు ఒప్పుకోకపోవడంతో అక్కడే బైఠాయించి కన్నీటి పర్యంతమైంది.
పోలీసులు ఆమెను వివరాలు అడిగినా సరైన సమాధానం చెప్పకపోవడంతో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ పోలీసులు ఆమెను విచారించగా, తనకు ముంబైలో ఇల్లు ఉందని, గతేడాది తన ఇంట్లో సుమారు రూ.40లక్షల వరకు దొంగతనం జరిగిందని, అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దీంతో బొల్లారానికి వచ్చి ఇక్కడ ఇంట్లో నివాసం ఉంటున్నానని, ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్వీకరించడం లేదన్నారు.
గవర్నర్‌కైనా చెప్పుకుందామని రాజ్ భవన్‌కు వచ్చానని, తనను ఎలాగైనా కల్పించాలని ఆమె ప్రాధేయపడింది. విచారణలో బొల్లారంలోని రిసాలబజార్‌లో నివాసం ఉండే నాగమణిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తుండటంతో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులకు పరీక్షగా మారింది. తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.