తెలంగాణ అవసరాలకు ఎన్ని టీఎంసీల నీళ్లు కావాలో కూడా తెలియని సర్కారు పెద్దలు.. ఆ చర్చల్లో పెద్ద పీటలేసుకుని కూర్చుంటే ఏం జరుగుతుంది? చివరకు బలయ్యేది ఎవరు? ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఐదేండ్లు ఉంటది, పోతది. కానీ ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం. తెలంగాణ హక్కులకు, నీటివాటాలకు సంబంధించిన విషయం. చిన్న తప్పు చేసినా తరతరాలకూ తీరని అన్యాయం చేసినట్టే! ఇవేవీ పట్టకుండా బాధ్యతారాహిత్య వ్యవహారం ఏమిటి? అడగడమే ఆలస్యం.. పసిడి పళ్లెంలో పెట్టి సమర్పించుకుంటామన్నట్టు ఈ నాటకమేమిటి?
అసలు ఈ చర్చలు జరుపుతున్నది ఎవరితో? 2018లో మీకు పంటలు పండే భూములెక్కడున్నాయని ఎగతాళి చేసినవాడితో! మీకు నీళ్లెందుకు? అంటూ ట్రిబ్యునల్ ముందు వాదించినవాడితో! మీ దగ్గర అగ్రో ైక్లెమేటే లేదని వెకిలిగా నవ్వినవాడితో! ఏపీ లేకపోతే దేశానికి ఆహారభద్రతే లేదన్నవాడితో! కాళేశ్వరం, పాలమూరు మీద పుంఖానుపుంఖాలుగా కేంద్రానికి ఫిర్యాదులు చేసినవాడితో! రేవంత్ ఇప్పుడు చర్చిస్తానంటున్నడు.
ఏదో ఉత్పాతం ముంచుకొస్తున్నది! కనిపించని కుట్ర ఏదో జరుగుతున్నది! ఢిల్లీ వేదికగా దీనికి రచన సాగుతున్నది! ముందే సిద్ధం చేసుకున్న డైలాగులు అటునుంచీ, ఇటునుంచీ చిట్‌చాట్ వల్లింపులై వినపడుతున్నాయి. మూడు రోజుల్లో ముఖ్యమంత్రి మాట్లాడిన మూడు రకాల మాటలే దీనికి సాక్ష్యం. ఆ మాటల్లో ధ్వనిస్తున్న లొంగుబాటు స్వరం భయం గొల్పుతున్నది. నీటి లభ్యత మీద ఆయన చెప్తున్న లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2,800 టీఎంసీలు కావాల్సిన చోట.. మాకు వెయ్యి చాలంటూ చేసిన ప్రకటన విభ్రాంతికి గురిచేస్తున్నది. ఆరు నూరైనా ససేమిరా అనాల్సిన చోట.. ‘చర్చించుకుందాం రా’ అంటూ ఇస్తున్న పిలుపు అనుమానాలను ధ్రువపరుస్తున్నది.
ప్రాజెక్టు కట్టేది వాళ్లు. అవసరం వాళ్లది. చర్చల ప్రతిపాదన అంటూ వస్తే వాళ్లనుంచి రావాలి. వాళ్లు మనని దేబరించాలి. అంతేగాని ‘నేనే ఒక అడుగు ముందుకు వేసి చర్చలకు పిలుస్తా’ అనడమేమిటి? కాళేశ్వరం కోసం ఆనాడు మనం మహారాష్ట్ర చుట్టూ తిరిగి ఒప్పించుకున్నమే తప్ప వాళ్లు రాలేదు. వాళ్లు అడిగినవన్నీ ఇచ్చి, అన్ని అనుమానాలు తీర్చి ఒప్పందం చేసుకున్నం.
అవసరం మనది కాబట్టి! కానీ ఇదేమిటి? వాళ్లు అడగకముందే రా.. రమ్మంటూ ఎర్రతివాచీ స్వాగతాలేమిటి? ఈ స్వామిభక్తి ప్రకటనలేమిటి? గురువైతే ఇంటికి పిలుచుకోండి. దండలేసి దణ్ణం పెట్టుకోండి. కానీ ఇది రాష్ట్రం! ఇది ప్రభుత్వం! మూడున్నర కోట్లమంది భవిష్యత్తుకు సంబంధించిన విషయం!
ఇన్నాళ్లు మోకాలడ్డిన ఆయనే ఇప్పుడు స్వరం మార్చి ‘మీరు ప్రాజెక్టులు కట్టుకోండి. మాకు అభ్యంతరం లేదు’ అంటున్నాడంటే అర్థం ఏమిటి? ‘మా రాష్ట్రం దివాళా తీసింది. ఖజానాలో పైసా లేదు’ అని ప్రకటించిన ముఖ్యమంత్రి, ఎలాగూ ప్రాజెక్టులు కట్టలేడనే కదా? కట్టినా కేంద్రం చేతిలో ఉంది కాబట్టి అనుమతులు రాకుండా అడ్డుపడగలననే ధీమాతోనే కదా? అక్కడితో ఆగకుండా తెలంగాణకు వంద టీఎంసీలు చాలు, అవి వాడుకుంటే గొప్ప అని నిన్నటికి నిన్న ఎకసెక్కం చేసినవాడితో మనకేం చర్చలు? కావేరిలోకి గోదావరిని మళ్లించి తమిళనాట ఓట్లు దండుకునేందుకు కేంద్రంలోని బీజేపీ, ఈ పథకంలో తన నీటి అవసరాలతోపాటు 80వేల కోట్ల రుణం కోసం బాబు, వారిద్దరితో అంటకాగేందుకు రేవంత్ కలిసి ఆడుతున్న నాటకమే ఈ కుట్ర!! ముప్పేట కుట్రల్లో బలిపెడ్తున్నది మాత్రం తెలంగాణనే!
కేంద్రంలో బీజేపీ సర్కారు ఉండాలంటే చంద్రబాబు మద్దతు అవసరం. చంద్రబాబు ఏపీలో మళ్లీ గెలవాలంటే బనకచర్ల కట్టాలి. బనకచర్ల పోలవరానికి అనుబంధ ప్రాజెక్టు
-ఢిల్లీలో సీఎం రేవంత్
చంద్రబాబు
బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ ఎవరితో నష్టం లేదు. రాద్ధాంతం ఎందుకు? దీనిపై పోరాటాలు అనవసరం.
రేవంత్
ఎవరితోనూ వివాదాలు కోరుకోవడం లేదు. చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి భేషజాలకు పోము.
చంద్రబాబు
గోదావరిపై ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి. మీరు వాడుకున్న తర్వాత మిగిలిన నీటినే మేం వాడుకుంటం. తెలంగాణ మహా అయితే వంద టీఎంసీలు వాడుతది.
రేవంత్
తెలంగాణలో మా ప్రాజెక్టు పూర్తయి, పూర్తిస్థాయిలో నీటిని వినియోగించుకున్న తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తే మాకు అభ్యంతరం లేదు.
చంద్రబాబు
తెలంగాణపై నేనెప్పుడైనా గొడవపడ్డానా? ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సమస్యను పరిష్కరించుకుందాం.
రేవంత్
తెలుగువారి మధ్య అనవసర సమస్యలు ఉండొద్దు. చంద్రబాబును చర్చలకు పిలుస్తం. కోర్టులకంటే చర్చలే మేలు.తెలంగాణలాగే ఏపీకి కూడా హక్కులుంటాయి.
రేవంత్ వాదన
గోదావరిలో 968 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు అనుమతిచ్చి, ఏపీ, లేదా ఎవరైనా ఎన్ని నీళ్లయినా వాడుకోవచ్చు. మాకు అభ్యంతరం లేదు. పోలవరం- బనకచర్లకు బదులు కేంద్రం నిధులిచ్చి ఇచ్చంపల్లి- నాగార్జునసాగర్ అనుసంధానం ద్వారా గోదావరి వరద జలాలను పెన్నా బేసిన్‌కు తీసుకువెళ్లే విషయంలో చర్చలు జరిపేందుకు మేం సుముఖంగా ఉన్నాం. తెలుగువారి మధ్య అనవసరమైన సమస్యలు ఉండొద్దు.
బీఆర్ఎస్ వాదన
గోదావరిలో ఇప్పటికే కేటాయించిన 968 టీఎంసీల వాడకానికి ఏ బాబు దయా దాక్షిణ్యాలూ అక్కర్లేదు. ఇక సముద్రంలోకి పోతున్న 3000 టీఎంసీల నీటిలో 1950 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాల్సిందే. అలాగే కృష్ణా జలాల్లో 750 టీఎంసీల వాటా ఇచ్చి తీరాలని మా ప్రభుత్వం ఇప్పటికే బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించింది. దీనికి కట్టుబడి ఉండాల్సిందే. గోదావరిలో మిగులు జలాలపై శాస్త్రీయ అధ్యయనం జరగాలె. దాని తర్వాతనే అనుసంధానం సంగతి! ఇచ్చంపల్లి నుంచి నీళ్లు తరలించేందుకు అంగీకరించే ప్రసక్తి లేనే లేదు.
సీఎం రేవంత్.. పూటకో మాట!.. మొన్న కానే కాదన్నడు!.. 18.6.25- బుధవారం
బనకచర్లకు కేంద్రం అనుమతులు రావడం భ్రమే. చంద్రబాబుకు సూచన చేస్తున్నా. కేంద్రంలో పలుకుబడి ఉన్నది కాబట్టి ప్రాజెక్టులు పూర్తవుతాయనుకుంటే పొరపాటే! గోదావరి జలాల్లో 3 వేల టీఎంసీల మిగులు జలాలున్నాయని చంద్రబాబు నమ్మితే 968 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు సంపూర్ణ అనుమతులివ్వాలి. కృష్ణా జలాల్లో 500 టీఎంసీలు వాడేందుకు అనుమతి ఇచ్చాక, ఆంధ్రప్రదేశ్ ఏ నీరు వాడుకున్నా మాకు అభ్యంతరం లేదు. అందర్నీ కలిసి మా సమస్యను వివరిస్తం. అప్పటికీ న్యాయం జరగకపోతే, కోర్టులను ఆశ్రయిస్తం.
– హైదరాబాద్‌లో అఖిలపక్షంలో సీఎం రేవంత్
నిన్న ఇచ్చంపల్లి అన్నడు!.. 19.6.25- గురువారం
గోదావరిలో వరద జలాలున్నాయని నిజంగా ఆంధ్రప్రదేశ్ భావిస్తే, పోలవరం- బనకచర్లకు బదులు కేంద్రం నిధులిచ్చే ఇచ్చంపల్లి- నాగార్జునసాగర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్‌కు నీళ్లు తీసుకువెళ్లే విషయంలో చర్చలకు మేం సిద్ధం.
– ఢిల్లీలో కేంద్ర మంత్రి పాటిల్‌తో సీఎం రేవంత్
నేడు బనకచర్లకు జై అంటున్నడు!.. 20.6.25- శుక్రవారం
ఎవరితో వివాదాలు కోరుకోవడం లేదు. బనకచర్లపై చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నం. 23న క్యాబినెట్లో సమీక్షించి, చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తం. అసలు చంద్రబాబు ఈ ప్రతిపాదనను ముందు మాకే చెప్పి ఉంటే వివాదమే ఉండేది కాదు. ఇప్పుడైనా కోర్టుకు వెళ్లడం కంటే ముందుగా చర్చించుకోవడం మంచిది.
– ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్