శేరిలింగంపల్లి, జూన్ 20: నక్షత తాబేళ్లు విక్రయించేందుకు యత్నించిన ఒకరిని అరెస్టు చేసిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మణికొండ సాయిరాంనగర్ ప్రాంతంలోని న్యూ బ్లే స్టార్క్ అక్వైరం షాపు నిర్వహించే చెరుకుల బాలస్వామి(40) నక్షత్ర తాబేళ్లు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు ఎస్ఓటీ, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
ఈ దాడిలో నిందితుడి నుంచి నాలుగు నక్షత్ర తాబేళ్లు, రెండు రెడ్ ఇయర్డ్ స్లైడర్ తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి అతడి స్నేహితుడు సురేశ్‌కుమార్ చెన్నై నుంచి తాబేళ్లను సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు బాలస్వామికి నోటీసు జారీ చేస్తామని, తాబేళ్లను అటవీశాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు పేర్కొన్నారు. మరో నిందితుడు సురేశ్ పరారీలో ఉన్నాడని చెప్పారు. కేసు ఫారెస్ట్ విభాగానికి బదిలీ చేస్తామన్నారు.