ICC : అంతర్జాతీయ క్రికెట్ మండలిలో ఎన్నికలకు వేళైంది. త్వరలోనే ఐసీసీ సభ్య దేశాలు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు గ్రెగ్ బార్క్లే (Greg Barclay) పదవీ కాలం ముగియనుంది. ఇప్పటికే రెండు పర్యాయాలు ఈ పదవిలో ఉన్న గ్రెగ్ ఇక వైదొలగాలని భావిస్తున్నాడు. అందువల్ల కొత్త బాస్ ఎంపిక అనివార్యమైంది. అయితే.. ఐసీసీ కొత్త చీఫ్గా భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ జై షా (Jais Shah) ఎన్నిక ఏకగ్రీవం కావడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఐసీసీ అధ్యక్షపదవి కోసం నామినేషన్ వేసేందుకు ఆగస్టు 27వ తేదీ ఆఖరు. ఆలోపు ఆశావహులు తమ నామినేషన్లు పంపాలి. ఆ తర్వాత ఓటింగ్ ద్వారా కొత్త అధ్యక్షుడిని ఎన్నుంటారు. అయితే.. అందరి కళ్లు బీసీసీఐ సెక్రటరీ జై షా మీదే ఉన్నాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా కొనసాగుతున్న షా ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుస్తాడని కొందరు అంటున్నారు. కానీ, ఈ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి మాత్రం ఇంకా నోరు మెదపడంలేదు.
‘ఎన్నికలు జరగాలంటే కనీసం ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉండాలి. అయితే.. ఈసారి ఎన్నికల్లో పోటీ ఉంటుందని మేము అనుకోవడం లేదు. ఐసీసీ కొత్త చీఫ్ కోసం ఎన్నికలు జరపాలా? వద్దా? అనేది జై షా నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ఒకవేళ అతడు నామినేషన్ వేశాడంటే ఎన్నికలే ఉండవు. అతడు ఏకగ్రీవంగా అధ్యక్ష పదవిని అలంకరిస్తాడు’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.