Pocharam-Guttha | నిజామాబాద్ జిల్లా బాన్స్ వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర వ్యవసాయశాఖ సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయనకు రాష్ట్ర సహాయ మంత్రి హోదా కల్పిస్తున్నట్లు మంగళవారం తెలిపింది. 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఎన్నికైన పోచారం శ్రీనివాసరెడ్డిని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తన క్యాబినెట్ లో వ్యవసాయ మంత్రిగా నియమించారు. 2018లో రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభాపతిగా పోచారం శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రావడంతో పోచారం శ్రీనివాసరెడ్డి.. అన్ని రకాల అవకాశాలు కల్పించిన బీఆర్ఎస్ పార్టీని కాదని పదవుల కోసం హస్తం పార్టీలో చేరారు. తాజాగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పదవి దక్కింది.
తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్ మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్గా గుత్తా అమిత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఈ పదవిలో ఆయన రెండేండ్ల పాటు ఉంటారు. ప్రస్తుతం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడే గుత్తా అమిత్ రెడ్డి. 2014లో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి.. తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తదుపరి తొలుత తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డిని మండలి చైర్మన్గా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన తర్వాత తాను శాసనమండలి చైర్మన్గా ఏ పార్టీలోనూ చేరబోనని చెప్పారు. కానీ, ఆయన కొడుకు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆయనకు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ పదవి దక్కింది.