మ్యాడ్, ఆయ్ లాంటి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు కథానాయకుడు నితిన్ నార్నే. ఈ రెండూ వినోదాత్మక చిత్రాలే కావడం విశేషం. ఎన్టీఆర్ బావమరిదిగా అందరికి సుపరిచితుడైన నార్నే నితిన్..ఇక ఈ రెండు హిట్ల తరువాత తన కెరీర్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు.
అయితే నార్నే నితిన్ షూటింగ్ మొదలుపెట్టి చిత్రీకరణ పూర్తిచేసుకున్న తొలిచిత్రం ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం నార్నే నితిన్ అరంగ్రేటం చిత్రం. అయితే ఇప్పుడు ఈ చిత్రం విడుదల కావడం సదరు హీరోకు ఇష్టం లేదట. అందుకే ఈ చిత్రం ప్రమోషన్‌కు కూడా తను సహకరించనని దర్శక, నిర్మాతలకు తేల్చిచెప్పాడట. జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును సొంతం చేసుకున్న శతమానం భవతి వంటి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సతీష్ వేగేశ్న శ్రీశ్రీశ్రీ రాజావారు చిత్రానికి దర్శకుడు.
సంపద నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని చింతపల్లి రామారావు నిర్మిస్తున్నారు. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం వుంటుందని, దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా ఈ చిత్రానికి హీరో సహకరించిన లేకపోయినా సినిమాను విడుదల చేస్తామని అంటున్నారు చిత్ర నిర్మాతలు. నితిన్ బావ ఎన్టీఆర్‌కు చాలా నచ్చిన కథతో ఈ చిత్రాన్ని రూపొందించామని, తప్పకుండా ఇప్పటి వరకు నితిన్ నటించిన చిత్రాలక ఇది భిన్నంగా వుంటుందని హీరోగా ఆయన మైలైజ్ పెంచుతుందని అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.
అయితే ఈ విషయంలో కొంత మంది సినీ ప్రముఖులు నితిన్‌ను కన్వీన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. వారి చర్చలు సఫలమైతే, ఈ చిత్రం ప్రమోషన్స్‌లో నితిన్ నార్నే పాల్గొనే అవకాశం వుంది. ఇక శ్రీశ్రీశ్రీ రాజావారు కరుణిస్తాడో లేదో వెయిట్ అండ్ సీ..