T20 World Cup 2024 : మహిళల టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అందరూ అనుకున్నట్టే ప్రపంచ కప్ వేదిక మారింది. బంగ్లాదేశ్(Bangladesh)లో అందోళనకర పరిస్థితుల దృష్ట్యా మెగా టోర్నీని యూఏఈ(UAE)లో జరిపేందుకు ఐసీసీ(ICC) సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు యూఏఈలో వరల్డ్ కప్ పోటీలు నిర్వహిస్తామని వెల్లడించింది.
‘బంగ్లాదేశ్ తరఫున టీ20 వరల్డ్ కప్ ఆతిథ్యం ఇవ్వనున్న ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. టోర్నీ నిర్వహణకు ముందుకొచ్చిన శ్రీలంక, జింబాబ్వే క్రికెట్ బోర్డులకు కూడా థ్యాంక్స్. 2026లోపు ఈ రెండు దేశాలకు మరో టోర్నీ జరిపే అవకాశం ఇస్తాం’ అని ఊసీసీ సీఈఓ అన్నాడు.
The ICC have moved the women’s T20 World Cup out of Bangladesh to the UAE 🔁
Full story: https://t.co/cKurmuonV6 pic.twitter.com/Ly8VVaa5tt
— ESPNcricinfo (@ESPNcricinfo) August 20, 2024
‘బంగ్లాదేశ్‌లో మహిళల వరల్డ్ కప్ నిర్వహించలేకపోవడం సిగ్గు చేటు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మెగా టోర్నీ నిర్వహణ కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసింది. కానీ, మ్యాచ్‌ల కోసం పది జట్ల ప్లేయర్లను తరలించండం కష్టంతో కూడినది. అయితే.. బంగ్లాదేశ్‌కు మరొక చాన్స్ ఇస్తాం. అక్కడ పరిస్థితులు చక్కబడ్డాక ఐసీసీ టోర్నీ జరిపేందుకు కచ్చితంగా అవకాశం కల్పిస్తాం’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డిసె తెలిపాడు.
షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ నెలలో మహిళ టీ20 వరల్డ్ కప్ జరగాలి. అయితే.. ఆతిథ్య హక్కులు దక్కించుకున్న బంగ్లాదేశ్ (Bangladesh)లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. హింసాత్మక దాడులతో అట్టుడ్డుకుతున్న బంగ్లాలో పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. దాంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) వరల్డ్ కప్ వేదికను తరలించే ప్రయత్నాల్లో ఉంది. ఆ ప్రక్రియలో భాగంగానే బీసీసీఐని ఐసీసీ సంప్రదించింది. అయితే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాత్రం ఐసీసీకి హ్యాండిచ్చింది.