Champions Trophy 2025 : వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్ (Pakistan) శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. కొత్త స్టేడియాల నిర్మాణంతో పాటు వసతుల ఏర్పాటును కూడా చకచకా చేసేస్తోంది. మరోవైపు టోర్నీ హైబ్రిడ్ మోడల్(Hybrid Model)లో జరుగనుందని, షెడ్యూల్ మారనుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందిస్తూ షెడ్యూల్ మార్పు అంతా కట్టు కథేనని అంటోంది.
‘చాంపియన్స్ ట్రోఫీ తేదీలపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రసారం చేయడం బాధాకరమని పీసీబీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) అన్నాడు. నిన్న మీడియా సమావేశంలో పీసీబీ చీఫ్ అన్న మాటలను కొందరు వక్రీకరించారు. భద్రతా కారణాలరీత్యా టోర్నీ షెడ్యూల్‌ను మారుస్తామని ఆయన చెప్పినట్టుగా ప్రచారం చేస్తున్నారు. దాంతో, వాళ్లు అనవసరమైన గందరగోళాన్ని సృష్టిస్తున్నారు’ అని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది.
వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మెగా టోర్నీ2025 ఫిబ్రవరి 19 షురూ కానుంది. ఆరంభ పోరు, ఒక సెమీస్ మ్యాచ్ కరాచీలో.. రెండో సెమీఫైనల్‌కు రావల్పిండిలో జరుగనున్నాయి. చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా, పాక్‌లు లాహోర్ వేదికగా తలపడనున్నాయి. అయితే.. అందుకు భారత క్రికెట్ బోర్డు అంగీకరించాల్సి ఉంటుంది. మార్చి 9న జరిగే ఫైనల్ ఫైట్‌కు కరాచీ వేదిక కానుంది.
సరిహద్దు వివాదం కారణంగా భారత్, పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు మూలనపడ్డాయి. కానీ, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) నిర్వహించే తటస్థ వేదికలపై ఇరుజట్లు తలపడుతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టును పాక్‌కు పంపేందుకు బీసీసీఐ(BCCI) ససేమిరా అంటోంది.
నిరుడు ఆసియా కప్ కోసం కూడా దాయది గడ్డపై టీమిండియా కాలు మోపలేదు. అయితే.. భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ ఆడింది కాబట్టి ఈసారి మన జట్టు అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తే… ఆ మ్యాచ్‌ను కూడా లాహోర్‌లో నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) సిద్ధంగా ఉంది. ఈసారి ఈ ట్రోఫీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. 15 మ్యాచ్‌ల తర్వాత ఫైనల్ బెర్తులు ఖరారవుతాయి.