IPL Mega Autcion : ఇండియన్ ప్రీమియర్ మెగా వేలంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఫ్రాంచైజీలతో పాటు అభిమానులు ఆసక్తిగా ఎదురు ఆక్షన్ తేదీ ఫిక్స్ అయింది. వచ్చే నవంబర్ మూడో వారం లేదా నాలుగో వారంలో వేలం పాటను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. అయితే.. ఈసారి కూడా విదేశాల్లోనే ఆక్షన్ నిర్వహిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మధ్య ఆసియా దేశాలైన అబూదాబీ, సౌదీ అరేబియాలో వేలం జరిపేందుకు బీసీసీఐ ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.
ఐపీఎల్ వేలం నిర్వహణకు ఈ దేశాలు కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. అధికారిక ప్రకటన వస్తేగానీ తేదీ, వేదికపై పూర్తిగా స్పష్టత రానుంది. 17వ సీజన్ మినీ వేలాన్ని దుబాయ్‌లోని కొకకోలా ఎరెనాలో జరిపారు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) అత్యధికంగా రూ.24.75 కోట్లు పలికిన విషయం తెలిసిందే.
ఐపీఎల్ మెగా వేలం తేదీ అయితే వచ్చింది గానీ.. రిటెన్షన్ విషయంపై ఇంకా ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. కనీసం ఈసారి 4 -5 మందిని అట్టిపెట్టుకునే అవకాశం ఇస్తారని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. వేలం జరగడానికి ముందు అంటే.. నవంబర్లోనే రిటెన్షన్ పాలసీపై బీసీసీఐ ప్రకటన వెల్లడించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
జేసన్ రాయ్, హ్యారీ బ్రూక్
అంతేకాదు వేలంలో అమ్ముడైన తర్వాత హ్యాండిచ్చిన విదేశీ ఆటగాళ్లపై రెండేండ్ల నిషేధంపై కూడా అప్పుడే క్లారిటీ రానుంది. హ్యారీ బ్రూక్ (Harry Brook), మిచెల్ మార్ష్, జేసన్ రాయ్, ఆడం జంపా, మార్క్ వుడ్(Mark Wood)లు వంటి ఫారెన్ క్రికెటర్లు 17వ సీజన్ మినీ వేలంలో భారీ ధర పలికారు. కానీ, తీరా టోర్నీ ఆరంభానికి ముందు మేము రావడం లేదంటూ ఫ్రాంచైజీలకు షాకిచ్చారు. అందుకని వీళ్లు మళ్లీ వేలంలో పాల్గొనకుండా రెండేండ్లు నిషేధం విధించాలని పలు ఫ్రాంచైజీలు బీసీసీఐకి మొర పెట్టుకున్నది విదితమే.