IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ప్రతి ఏడాది ఆదరణ పెరుగుతోంది. టీ20ల్లో అతి పెద్ద క్రికెట్ పండుగగా పేరొందిన ఈ మెగా లీగ్ మండు వేసవిలో క్రీడాభిమానులను అలరిస్తోంది. ఐపీఎల్‌ను మరింత ఆకర్షణగా మార్చేందుకు బీసీసీఐ కీలక నిర్ణయానికి వచ్చింది. త్వరలోనే 94 మ్యాచ్‌లు ఆడించాలని భారత బోర్డు భావిస్తోంది. అన్నీ కుదిరితే 2028 నుంచే మ్యాచ్‌ల సంఖ్య పెంచేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తోందని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ (Arun Dhumal) వెల్లడించాడు. అయితే.. ఫ్రాంచైజీల సంఖ్య మాత్రం పెంచబోమని ఆయన స్పష్టం చేశాడు.
‘ఐపీఎల్‌కు ఎంతో క్రేజ్ ఉంది. అందుకే మ్యాచ్‌ల సంఖ్యను పెంచాలనుకుంటున్నా. 2028 నుంచే 94 మ్యాచ్‌లతో లీగ్‌ను నిర్వహించాలనే ఉద్దేశం ఉంది. ఈ విషయమైన ఐసీసీ, బీసీసీఐ సభ్యులతో చర్చిస్తున్నాం. ఐసీసీ ఈవెంట్లు, ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు ఫ్రాంచైజీ క్రికెట్‌ను కూడా ఫ్యాన్స్ ఆదరిస్తున్నారు.
The BCCI is actively considering expanding the IPL season to 94 matches from 2028, but has no plans to introduce new franchises in the near future ▶️ https://t.co/7RwwigiXxX pic.twitter.com/VJZTOl0T8a
— ESPNcricinfo (@ESPNcricinfo) April 28, 2025
సో.. ఎక్కువ మ్యాచ్‌లు ఆడించడం ద్వారా వాళ్లకు మరింత వినోదాన్ని పంచాలనేది మా ఆలోచన. కాబట్టి.. ప్రస్తుతం 74 మ్యాచ్‌లతో సాగుతున్న ఐపీఎల్‌ను దశలవారీగా 84 నుంచి 94 మ్యాచ్‌లకూ తీసుకెళ్లాలని భావిస్తున్నాం. అప్పుడు.. ప్రతి జట్టు సొంత గడ్డపై, ప్రత్యర్థి గడ్డపై రెండేసి మ్యాచ్‌లు ఆడేందుకు వీలుంటుంది అని ధుమాల్ వివరించాడు. మ్యాచ్‌ల పెంపు గురించి హింట్ ఇచ్చిన ధుమాల్ జట్ల సంఖ్యను మాత్రం పెంచబోమని తేల్చి చెప్పాడు. అంటే.. ఇప్పుడున్న 10 ఫ్రాంచైజీలతోనే ఐపీఎల్ 2028 జరుగనుందన్నమాట.
టీ20ల్లో సంచలనం రేకెత్తించిన ఐపీఎల్ ఆరంభ సీజన్(2008)లో 59 మ్యాచ్‌లు నిర్వహించారు. 8 జట్లు పోటీపడగా రాజస్థాన్ రాయల్స్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. 2010లో మ్యాచ్‌ల సంఖ్య 60కి చేరింది. ఆ తర్వాతి ఎడిషన్‌లో 74 మ్యాచ్‌లు. 2012లో 76 మ్యాచ్‌లు ఆడించారు. అయితే.. 2014 నుంచి 2021 వరకూ 60 మ్యాచ్‌లతోనే టోర్నీ ముగించారు.
అయితే.. 2022లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలతో కలిపి 10 జట్లు బరిలోకి దిగడంతో మ్యాచ్‌ల సంఖ్యను మళ్లీ 74కు పెంచారు. మ్యాచ్‌ల సంఖ్య పెంపుపై బ్రాడ్కాస్టర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డబుల్ హెడర్స్ ఎక్కువగా కవర్ చేయాల్సి వస్తుందనేది వాళ్ల వాదన. కానీ, బీసీసీఐ, ఐపీఎల్ పాలక వర్గం మాత్రం మ్యాచ్‌లను పెంచేందుకే మొగ్గు చూపుతోంది.