TGSRTC | టీజీఎస్ఆర్టీసీ కండక్టర్ వెంకటేశ్వర్లు నిజాయితీని చాటుకున్నారు. బస్సులో పోగొట్టుకున్న రూ.13 లక్షల విలువగల బంగారు, వెండి ఆభరణాలు, నగదుతో కూడిన బ్యాగును ప్రయాణికుడికి అందజేశాడు. ఈ సందర్భంగా ఉదారత చాటుకున్న అచ్చంపేట డిపోనకు చెందిన వెంకటేశ్వర్లును టీజీఎస్ఆర్టిసీ యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్లో సోమవారం ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఆయనను సన్మానించి.. ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
అచ్చంపేట-హైదరాబాద్ రూట్ టీజీఎస్ఆర్టీసీ బస్సులో ఈ నెల 26న కండక్టర్ వెంకటేశ్వర్లు విధులు నిర్వహించారు. ఎంజీబీఎస్‌కు చేరుకోగానే బస్సులో ఎవరో ప్రయాణికుడు బ్యాగ్‌ను మరచిపోయినట్లు కండక్టర్ గుర్తించారు. బ్యాగును తెరిచి చూడగా అందులో బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు, పలు సర్టిఫికెట్లు ఉన్నాయి. వెంటనే ఈ విషయాన్ని అచ్చంపేట డీఎం మురళీ దుర్గా ప్రసాద్‌కు ఫోన్లో కండక్టర్ సమాచారం అందించారు. బ్యాగ్‌ను ఎంజీబీఎస్‌లోని స్టేషన్ మేనేజర్ కార్యాలయంలో అప్పగించాలని డీఎం సూచించారు. ఇంతలోనే అనిల్ కుమార్ అనే ప్రయాణికుడు డీఎంకి ఫోన్ చేసి బస్సులో బ్యాగును మరచిపోయినట్లు చెప్పారు. కందుకూరులో బస్సు ఎక్కి సీబీఎస్‌లో దిగి కాచిగూడకు వెళ్లిపోయానని పేర్కొన్నారు. దీంతో ఎంజీబీఎస్‌లోని స్టేషన్ మేనేజర్ కార్యాలయానికి వెళ్లాలని డీఎం సూచించారు. టీజీఎస్ఆర్టిసీ అధికారులు వివరాలను పరిశీలించి.. బ్యాగును ప్రయాణికుడు అనిల్ కుమార్ కు అందజేశారు. ఆ బ్యాగులో 14 తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.14,800 నగదు, అనిల్ కుమార్ స్టడీ సర్టిఫికెట్లు, అతని కుమారుడి బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయి.
కాగా, విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించి రూ.13 లక్షల విలువైన ఆభరణాలతో కూడిన బ్యాగును ప్రయాణికుడికి అందజేసిన కండక్టర్ వెంకటేశ్వర్లును సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ అభినందించారు. సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూనే ‘ఎక్స్ట్రా మైల్’ దిశగా సమాజంలో ఆర్టీసీ సిబ్బంది ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారని కొనియాడారు.
#TGSRTC conductor Venkateshwarlu sets an inspiring example of honesty!
He returned a bag containing gold and silver ornaments worth ₹13 lakh, along with cash, to a passenger who had lost it on the bus.
The #TGSRTC management appreciated Venkateshwarlu, who is from the Achampet… pic.twitter.com/hWTdl31GVH
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) April 28, 2025