ఖైరతాబాద్, ఏప్రిల్ 28 : జీహెచ్ఎంసీ లాంగ్ స్టాండింగ్ ఇంజనీరింగ్ అధికారుల అలసత్వం కారణంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నాలాలో వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో వరద ముంపునకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇప్పటికైనా అధికారులు స్పందించి వ్యర్థాలను తొలగించి, వరద ముంపు తప్పించాలని స్థానికులు కోరుతున్నారు.
గతంలో నాలాల్లో వ్యర్థాలు పేరుకుపోయి అనేకసార్లు బస్తీలు వరద ముంపునకు గురయ్యాయి. నాలాలో పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాల్సిన జీహెచ్ఎంసీ అలసత్వం ప్రదర్శిస్తుండటంతో వరద ముంపు కష్టం తీరేలా కనబడటం లేదు. ఖైరతాబాద్ సర్కిల్ 17 పరిధిలోని తుమ్మల బస్తీలో ఉన్న బల్కాపూర్ నాలా రెండు నెలల వ్యవధిలో వరద రెండుసార్లు ముంపునకు గురైంది. హడావిడి చేసిన సర్కిల్ జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు వాటిని తొలగించేందుకు ఎక్స్వేటర్ను నాలాలో దించి తొలగించే ప్రయత్నం చేయగా మరోసారి కురిసిన భారీ వర్షానికి ఆ యంత్రం వరద వ్యర్థాలు కూరుకుపోయి మూలాన పడింది. కిందపడి, మీదపడి ఆ యంత్రాన్ని బయటికి తీయగలిగారు. కానీ వ్యర్థాలను మాత్రం అలాగే వదిలేశారు. ఫలితంగా మరోసారి తుమ్మల బస్తీ బల్కాపూర్ నాలా మరోసారి వరద పొంచి ఉంది. అది అధికారుల నిర్లక్ష్యమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్లు మారుతున్నారు కానీ ఆ అధికారుల సీట్లను కదిలించే ధైర్యం చేయలేకపోతున్నారని అంటున్నారు. ఇప్పటికైనా సదరు లాంగ్ స్టాండింగ్ అధికారులు స్పందించి నాలాలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి వరద ముంపు తప్పించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.