IPL 2023 | ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) అంటే తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. ప్రారంభమైన కొద్ది సమయంలోనే ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ఈ లీగ్ ఇపుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన లీగ్‌గా అగ్రస్థానంలో నిలిచింది. సాధారణంగా క్రికెట్లో ఆటగాళ్లకే గుర్తింపు, ఆదరణ ఎక్కువ. అయితే జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంలో సహాయ సిబ్బంది పాత్ర తక్కువేమీ కాదు. ముఖ్యంగా చీఫ్ కోచ్ జట్టు విజయాలలో ప్రముఖపాత్ర పోషిస్తుంటాడు. జట్టులో ఎవరు ఆడాలి, ఏ మ్యాచ్‌లో ఎవరిని ఆడించాలి, ఎపుడు..ఎవరికి విశ్రాంతి ఇవ్వాలి, ఏ మ్యాచ్‌లో ఎలాంటి జట్టును బరిలోకి దింపాలి అనే విషయాల్లో చీఫ్ కోచ్ కీలకం. అటువంటి ముఖ్య పదవిలో బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తించడమంటే ఆషామాషీ కాదు. జట్టు జయాపజయాలకు కోచ్కూడా చాలవరకు కారణమే. అందుకే ఆటగాళ్ల కొనుగోలు తరువాత చీఫ్ కోచ్ నియామకంలో ఫ్రాంచైజీలు ఆచితూచి వ్యవహరిస్తుంటాయి. అటువంటి పదవిలో ఉన్న ఐపీఎల్ ఫ్రాంచైజీల చీఫ్ కోచ్‌ల గురించి తెలుసుకుందాం.
Mark Boucher
అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్(5సార్లు చాంపియన్) ఈ యేడాది కొత్తగా సౌతాఫ్రికాకు చెందిన మార్క్ బౌచర్‌ను తమ ప్రధాన కోచ్‌గా నియమించుకుంది. ఇప్పటివరకు ప్రధాన కోచ్‌గా ఉన్న మహేల జయవర్ధనె ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ నిర్వహణలోని మూడు జట్లకు(ఐపీఎల్, ఐఎల్టి20, ఎస్ఎటి20) ఫర్ఫార్మెన్స్ హెడ్‌గా నియమితుడవడంతో బౌచర్‌కు ఈసారి హెడ్‌కోచ్‌గా అవకాశం దక్కింది. ఆస్ట్రేలియాలో జరిగిన గత ఐసీసీ టి20 ప్రపంచకప్ అనంతరం బౌచర్ దక్షిణాఫ్రికా జట్టు కోచ్ పదవికి గుడ్‌బై చెప్పి ఇపుడు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు సేవలందించేందుకు సిద్ధమయ్యాడు. అయితే బౌచర్‌కు ఐపీఎల్ కొత్తేమీ కాదు. గతంలో 2016లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కీపింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. అంతేగాక ఆటగాడిగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్ బెంగళూరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 46 ఏళ్ల బౌచర్ దక్షిణాఫ్రికా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 147 టెస్టులు, 295 వన్డేలు, 25 టి20లలో ప్రాతినిథ్యం వహించి 10వేలకుపైగా పరుగులు సాధించాడు. వికెట్‌కీపర్, ఫీల్డర్‌గా 900కుపైగా క్యాచ్‌లు పట్టి 46 స్టంపింగ్‌లు చేశాడు. గత సీజన్లో అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్‌ను బౌచర్ ఈసారి ఏ స్థాయికి చేరుస్తాడో చూడాలి.
Stephen Fleming
ఐపీఎల్లో రెండో అత్యంత విజయవంతమైన జట్టు(4సార్లు చాంపియన్) చెన్నై సూపర్ కింగ్స్. ఈ జట్టు హెడ్ కోచ్ ఫ్లెమింగ్కూడా విజయవంతమైన కోచ్‌గా నిలిచాడు. అతడు కోచ్‌గా ఉన్న నాలుగు సీజన్లలో చెన్నై టైటిల్ సాధించడం గమనార్హం. న్యూజిలాండ్ అందించిన గొప్ప బ్యాట్స్‌మెన్‌గా ఘనత వహించిన ఫ్లెమింగ్ తొలి సీజన్(2008)లో చెన్నైకు ఆటగాడిగా ప్రాతినిథ్యం వహించాడు. అయితే 2009 సీజన్లో ఆటగాడినుంచి కోచ్‌గా మారాడు. వరుసగా రెండు సంవత్సరాలు జట్టును చాంపియన్‌గా నిలిపాడు. బెట్టింగ్ ఆరోపణలపై 2017, 2018 సంవత్సాలలో చెన్నై జట్టు సస్పెండ్ అయిన తరుణంలో ఫ్లెమింగ్ రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ జట్టు కోచ్‌గా వ్యవహరించాడు. సస్పెన్షన్ ఎత్తివేసిన వెంటనే తిరిగి చెన్నై జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టి మళ్లీ చాంపియన్‌ను చేశాడు. మళ్లీ 2021లో అతని కనుసన్నల్లోనే చెన్నై తిరిగి టైటిల్‌ను గెలుచుకుంది. ఇలా చెన్నై జట్టు టైటిల్ గెలిచిన నాలుగుసార్లు కోచ్‌గా ఉండి ఐపీఎల్లో ఉత్తమ కోచ్‌గా ప్రశంసలందుకున్నాడు.
Chandrakant Pandit
చీఫ్ కోచ్‌లలో అత్యంత పెద్ద వయస్కుడు. కీపర్ బ్యాట్స్‌మన్ అయిన చంద్రకాంత్ దేశవాళీ క్రికెట్లో ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్నాడు. కోచ్‌గా సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌కు 2021-22లో తొలిసారి రంజీ ట్రోఫీ అందించాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ట్రోఫీ నెగ్గిన ఆరు జట్లకు అతడు కోచ్‌గా వ్యవహరించాడు. అంతేగాక కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కోచ్‌గా నియమితుడైన తొలి భారతీయుడు. ఐపీఎల్ చరిత్రలో సంజయ్ బంగర్, ఆశిష్ నెహ్రా తరువాత కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన మూడో భారతీయుడు. కోల్‌కతా జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న బ్రెండన్ మెకల్లమ్‌కు ఇంగ్లండ్ పురుషుల జట్టుకు కోచ్‌గా అవకాశం రావడంతో ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. దానితో కెకేఆర్ చంద్రకాంత్ పండిట్‌ను తమ కోచ్‌గా నియమించుకుంది. రెండుసార్లు టైటిల్ నెగ్గిన కోల్‌కతా ఎనిమిదేళ్లుగా మూడో టైటిల్కోసం ఎదురు చూస్తున్నది. ఆట విషయంలో చంద్రకాంత్ చాలా నిక్కచ్చిగా ఉంటాడు. అంతగా పేరులేని ఆటగాళ్లతో అద్భుతాలు సృష్టిస్తుంటాడు. మరి ఈసారి కోల్‌కతాను ఏ స్థాయికి తీసుకెళతాడో వేచి చూద్దాం.
Kumara Sangakkara
తొలి సీజన్లో చాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ మళ్లీ ఆ స్థాయి ఆటను ప్రదర్శించడంలో గత సీజన్‌వరకు విఫలమైంది. గత సీజన్లో రన్నరప్‌గా నిలిచింది. అటువంటి జట్టును తిరిగి చాంపియన్‌గా నిలపాలని సంగక్కర కంకణం కట్టుకున్నాడు. అయిదు సీజన్లలో డక్కన్ చార్జర్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆడిన సంగక్కర తరువాత కోచ్‌గా అవతారమెత్తాడు. 2021లో హెడ్‌కోచ్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా కూడా నియమితుడయ్యాడు. ఈ నేపథ్యంలోనే గత సీజన్లో రాజస్థాన్‌ను రెండో స్థానంలో నిలిపాడు. మరోసారి రాజస్థాన్ చాంపియన్ అవ్వాలంటే అది సంగక్కరకే సాధ్యం.
Brian Lara
వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా ఐపీఎల్లో ఆడనప్పటికీ అతడు సహాయ సిబ్బందిలో ఉండడం ఏ జైట్టెనా గౌరవంగా భావిస్తుంది. లారా గతంలో సన్‌రైజర్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా, సలహాదారుగా వ్యవహరించిన అనుభవముంది. లారా తక్షణ కర్తవ్యం మరోసారి హైదరాబాద్ జట్టును చాంపియన్‌గా నిలపడమే. కొత్త యాజమాన్యంలో 2016లో చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ మళ్లీ వెనుకబడింది. గత సీజన్లో పది జట్లలో 8వ స్థానంలో నిలిచింది. ఇపుడు జట్టుకు మార్కరమ్ రూపంలో కొత్త కెప్టెన్ రావడంతో లారా పని మరింత క్లిష్టం కానున్నది. అయితే సౌతాఫ్రికా టి20 లీగ్‌లో మార్కరమ్ సన్‌రైజర్స్ జట్టును విజేతగా నిలపడం కలిసొచ్చే అంశం. లారా-మార్కరమ్ కలిసి సన్‌రైజర్స్ జట్టును చాంపియన్‌గా నిలపడమే ఇపుడు వారి ముందున్న తక్షణ కర్తవ్యం. ఈ లక్ష్య సాధనలో లారా ఎంతవరకు సఫలీకృతమౌతాడో చూడాలి.
Ashish Nehra
హెడ్ కోచ్‌లలో అతి పిన్న వయస్కుడు నెహ్రా. వయసులో చిన్నవాడైనా ఫలితాల్లో మేటి అని గత సీజన్లో నిరూపించాడు. లీగ్‌లో పాల్గొన్న తొలిసారే గుజరాత్ టైటాన్స్‌ను చాంపియన్‌గా నిలిపాడు. ఆటగాడిగా, కోచ్‌గా వివిధ జట్లతో పనిచేసిన అనుభవం నెహ్రా సొంతం. ఆటగాడిగా ఢిల్లీ, హైదరాబాద్, పుణె, ముంబై, చెన్నై జట్లకు సేవలందించిన నెహ్రా 2018, 2019లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు బౌలింగ్ కోచ్గాకూడా వ్యవహరించాడు. ఆటగాడిగా 2017లో రిటైర్మెంట్ ప్రకటించిన నెహ్రా గత సీజన్లో కోచ్‌గా కూడా సత్తా చాటాడు. చెన్నై, ముంబై జట్ల తరువాత టైటిల్ నిలబెట్టుకున్న జట్టుగా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్న గుజరాత్ టైటాన్స్‌ను ఆశలను నెహ్రా తీరుస్తాడేమో చూడాలి.
Ricky Ponting,
ఆస్ట్రేలియా, అంతర్జాతీయ క్రికెట్లో పేరెన్నికగన్న రికీ పాంటింగ్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ కేపిటల్స్‌ను చాలావరకు తీర్చిదిద్డాడు. అతని నేతృత్వంలోనే శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ మేటి ఆటగాళ్లుగా రాటుదేలారు. 2018లో ఢిల్లీ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన పాంటింగ్ మరుసటి యేడాది మూడో స్థానంలో నిలిచింది. తరువాత ఏడాది రన్నర్ప్ స్థానానికి ఎదిగింది. అయితే తరువాతి యేడాది మళ్లీ మూడో స్థానానికి చేరుకుంది. ఢిల్లీ జట్టు ఇప్పటివరకు టైటిల్ గెలవకపోయినా మేటి జట్లకు పోటీ ఇచ్చేదిగా ఎదిగింది. ఇదంతా పాంటింగ్ చలవే. ఢిల్లీ హెడ్‌కోచ్‌గా రాకముందు పాంటింగ్ మూడేళ్లపాటు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. అతని నేతృత్వంలోనే ముంబై 2015లో టైటిల్ దక్కించుకుంది. ఆటగాడిగా ఎంతో పేరు తెచ్చుకున్న పాంటింగ్ కోచ్‌గా తనదైన ముద్రను వేసుకోవాలని, అందుకు ఢిల్లీని చాంపియన్‌గా చూడాలని ఆశిస్తున్నాడు.
Andy Flower
జింబాబ్వేకు అంతర్జాతీయ క్రికెట్లో పేరు తెచ్చిన వన్నెగాడు ఆండీ ఫ్లవర్. అటగాడిగా సొగసరి ఆటతో అందరి మన్ననలు అందుకున్న ఆండీ కోచ్‌గా ఇపుడిపుడే రాణిస్తున్నాడు. 2020-21 సీజన్లలో పంజాబ్ కింగ్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించి గత సీజన్లో కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్‌కు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. తొలి సీజన్లోనే లక్నోను మూడో స్థానంలో నిలబెట్టి తన ప్రాధాన్యతను తెలిసేలా చేశాడు. ఈసారి మరో మెట్టు ఎక్కాలని కోచ్ ఆండీ, కెప్టెన్ కెఎల్ రాహుల్ ఆశిస్తున్నారు. ఆండీ ఫ్లవర్ గతంలో ఇంగ్లండ్‌కు అసిస్టెంట్ కోచ్, టీమ్ డైరెక్టర్, హెడ్‌కోచ్‌గా పుష్కరకాలంపాటు సేవలందించాడు. ఇంగ్లండ్‌ను టెస్టు ర్యాంకింగ్‌లో నంబర్‌వన్‌గా నిలపడంలో ముఖ్యపాత్ర పోషించాడు. అంతటి అనుభవమున్న ఆండీఫ్లవర్ లక్నోను చాంపియన్‌గా చూడాలనుకుంటున్నాడు.
Trevor Bayliss
గత 15 ఏళ్లుగా టైటిల్కోసం పోరాడుతున్న పంజాబ్ జట్టుకు బేలిస్ తొలి టైటిల్ అందించాలని యోచిస్తున్నాడు. కోచ్‌గా పేరుప్రఖ్యాతులున్న బేలిస్ 2012, 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు టైటిల్ అందించాడు. 2015లో ఇంగ్లండ్ హెడ్‌కోచ్‌గా నియమితుడైన బేలిస్ ఇంగ్లండ్‌ను ప్రపంచ వన్డే చాంపియన్‌గా చేశాడు. పంజాబ్ జట్టుకు కొత్తగా కోచ్‌గా నియమితుడైన బేలిస్ తక్షణ కర్తవ్యం ఆ జట్టును వీలైనంత మెరుగైన స్థానానికి చేర్చడమే. ఇప్పటివరకు ఒకేసారి ఫైనల్‌కు చేరిన పంజాబ్ బేలిస్పైనే ఆశలు పెట్టుకుంది. డెత్ ఓవర్స్‌లో ధాటిగా బ్యాటింగ్ చేయడం, మిడిల్ ఓవర్లలో వికెట్లు రాబట్టడంలో రాణిస్తే పంజాబ్‌కు టైటిల్ దక్కుతుందని బేలిస్ ఆశిస్తున్నాడు. అందులో ఎంతవరకు రాణిస్తాడో చూడాలి.
Sanjay Bangar
ఐపీఎల్లో అత్యంత విఫలమైన జట్టుగా పేరున్న బెంగళూరు జట్టుకు హెడ్‌కోచ్‌గా వ్యవహరించడమంటే మాటలుకాదు. హేమాహేమీలున్నా కీలక దశలో ఓటమి పాలవడం రాయల్ చాలెంజర్స్‌కు అలవాటుగా మారింది. అటువంటి జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న బంగర్ ఏ మేరకు జట్టును నడిపిస్తాడన్నది ఆసక్తికరం. బంగర్‌కు 2010నుంచి ఐపీఎల్‌తో అనుభవముంది. తొలుత కొచ్చి టస్కర్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న బంగర్ తరువాత పంజాబ్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వెళ్లి ఆ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. 2016లొ జింబాబ్వేలో పర్యటను వెళ్లిన భారత జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తమ రాణింపులో బంగర్ పాత్ర మరువలేనిదని కితాబివ్వడం గమనార్హం. 2021లో హెడ్ కోచ్‌గా నియమితుడైన బంగర్ తదుపరి యేడాది బెంగళూరు జట్టును 4వ స్థానంలో నిలిపాడు. ఆర్సీబీని చాంపియన్‌గా నిలిపి ఆ ఘనత సాధించిన తొలి కోచ్‌గా పేరుగాంచాలని భావిస్తున్నాడు.
IPL 2023 | నేటి నుంచి ఐపీఎల్-16వ సీజన్ షురూ.. తొలి పోరులో గుజరాత్‌తో చెన్నై ఢీ