Vinesh Phogat : విశ్వ క్రీడల్లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ (Vinesh Phogat ) అనర్హతకు గురవ్వడం అందర్నీ విస్తుపోయేలా చేసింది. అది కూడా ఫైనల్‌కు ముందు అదనపు బరువు ఉందని ఆమెను పోటీ నుంచి తప్పించారు. దాంతో, అసలు వినేశ్‌కు ఎందుకిలా జరిగింది? అని యావత్ భారతావని తలపట్టుకుంది. భారత రెజ్లర్ కోచ్, న్యూట్రిషనిస్టు, డాక్టర్లు ఏం చేశారు? అని కొందరు కోపంగా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌కు భారత బృందంతో వెళ్లిన వైద్యాధికారి దిన్షా పర్దివలా(Dinshaw Pardhiwala)స్పందించారు.
బుధవారం ఫైనల్ మ్యాచ్ ఇంకొన్ని గంటలు ఉంటే వినేశ్ బరువు సరిపోయేదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘మామూలుగా రెజ్లర్లు తమ బరువు కంటే తక్కువ విభాగంలో పోటీ పడుతారు. అందువల్ల శారీరకంగా బాగా బలంగాలేని వాళ్లతో తలపడుతారు. దాంతో, మ్యాచ్ సమయానికి బరువు తగ్గడం కోసం లెక్క ప్రకార ఉదయాన్నేఆహారం, నీళ్లు తీసుకుంటారు. దీనికి తోడూ వ్యాయామాల ద్వారా రెజ్లర్లు చెమటోడ్చాల్సి ఉంటుంది. చివరకు అనుకున్నట్టే బౌట్ సమయానికి బరువు తగ్గుతారు.
అయితే.. ఒకేసారి బరువు తగ్గడం వల్ల నీరసిస్తారు. శక్తి కూడా తగ్గుతంది. అందుకని చాలామంది రెజ్లర్లు నీళ్లు తక్కువగా, శక్తినిచ్చే ఆహారం ఎక్కువగా తీసుకుంటారు. అథ్లెట్‌ను బట్టి న్యూట్రిషనిస్టు వెయిట్ కటింగ్ ప్లాన్ చేస్తారు. వినేశ్ విషయానికొస్తే.. ఒక్కరోజు ఆమెకు 1.5 కేజీ పోషకాలు ఇవ్వాలని న్యూట్రిషనిస్టు భావించాడు. సాధారణ పద్ధతుల్లోనే ఆమె బరువు తగ్గుతుందని ఆయన నమ్మారు. కానీ, దురదృష్టవశాత్తూ మంగళవారం వినేశ్ వరుసగా మూడు బౌట్(తొలి రౌండ్, క్వార్టర్స్, సెమీఫైనల్)లలో తలపడిన కారణంగా అవేవీ వర్కవుట్ కాలేదు.
అనుకోకుండా వినేశ్ 2.7 కిలోల బరువు పెరిగింది. దాంతో, మేము ఆమెతో రాత్రంత వ్యాయామాలు చేయించాం. ఆమె జుట్టును మరింత కత్తిరించాం. రెజ్లింగ్ పోటలకు వేసుకొనే డ్రెస్సెను కూడా చిన్నగా చేశాం. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.. ఫైనల్‌కు ముందు వినేశ్ 50 కిలోల 100 గ్రాములు తూగింది. దాంతో, నిర్వాహకులు ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు. ఒకవేళ ఫైనల్‌కు ఇంకొంచెం సమయం ఉంటే వినేశ్ ఆ 100 గ్రాములు కూడా తగ్గేది. అప్పుడు ఏ అభ్యంతరం లేకుండా పోటీపడేది’ అని పర్దివలా వివరించాడు.