వికారాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పత్తి రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. పత్తి విక్రయించే సమయంలో ఏదో ఒక కొర్రీ పెట్టి రైతులను ఇబ్బందులు పెట్టిన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా).. పత్తిని విక్రయించిన అన్నదాతలకు డబ్బులు చెల్లించడంలోనూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నది. ఐదారు రోజుల్లోగా పత్తిని విక్రయించిన రైతులకు చెల్లింపులు పూర్తి చేస్తామంటూ సీసీఐ అధికారులు చెబుతున్నప్పటికీ.. రెండు నెలలు దాటినా జాడలేదు.
పత్తిని సేకరించిన అనంతరం వెంటనే బిల్లులు చేయాల్సిన సీసీఐ కొనుగోలు కేంద్రాల సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో అన్నదాతలకు చెల్లింపుల జమ కావడంలో జాప్యం జరుగుతున్నట్లు మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. అన్ని బిల్లులు అందజేసినప్పటికీ చెల్లింపుల్లో సీసీఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కొందరు రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ కాకపోవడం, ఆధార్ మ్యాపింగ్ లేకపోవడం తదితర కారణాలతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
మరోవైపు జిల్లాలో రూ.634 కోట్ల విలువైన పత్తిని అన్నదాతల నుంచి సేకరించగా, ఇప్పటివరకు రూ.580 కోట్ల వరకు చెల్లింపులను రైతుల బ్యాంకు ఖాతాల్లో సీసీఐ జమ చేయగా, మరో రూ.50 కోట్లకుపైగా చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. అధికారికంగా 300 మంది అన్నదాతలకు మాత్రమే టెక్నికల్ సమస్యలతో చెల్లింపులు నిలిచిపోయాయని సంబంధిత అధికారులు చెబుతున్నప్పటికీ, రూ.50 కోట్లపైనే చెల్లింపులు పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది.
సేకరించిన పత్తికి సంబంధించి బిల్లులు పూర్తి చేసి సీసీఐకి పంపామని చెప్తున్న అధికారులు.. పత్తి రైతులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు ఎన్ని కోట్లు పెండింగ్లో ఉన్నాయనే విషయంపై స్పష్టత మాత్రం ఇవ్వకుండా గోప్యంగా ఉంచుతున్నారు. ఇప్పటికే పత్తి కొనుగోలు కేంద్రాలను మూసివేసిన సీసీఐ అధికారులు.. మార్చి మొదటి వారంలోగా చెల్లింపులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 2.54 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా.. 2 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు నిర్దేశించుకున్న టార్గెట్లో కనీసం సగం కూడా చేరుకోలేదు.

79,136 మెట్రిక్ టన్నుల పత్తి సేకరణ
జిల్లావ్యాప్తంగా 14 కొనుగోలు కేంద్రాల ద్వారా సీసీఐ పత్తిని సేకరించింది. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి వస్తుందని అధికారులు అంచనా వేయగా.. 79,136 మెట్రిక్ టన్నుల పత్తిని 48,643 వేల మంది అన్నదాతల నుంచి కొనుగోలు చేశారు. అకాల వర్షాలతో పత్తి కొంతమేర నష్టపోయినప్పటికీ దిగుబడి మాత్రం తగ్గలేదని అధికారులు చెబుతున్నా.. సీసీఐ కేంద్రాలకు మాత్రం నిర్దేశించిన టార్గెట్లో సగం మేర పత్తిని రైతులు తీసుకురాలేకపోయారు. ప్రధానంగా పత్తిని విక్రయించిన అన్నదాతలు డబ్బుల కోసం సీసీఐ కేంద్రాల చుట్టూ పడిగాపులు గాస్తున్న పరిస్థితిని చూసిన మిగతావారు.. డబ్బులు వెంటనే వస్తాయనే ఉద్దేశంతో తక్కువ ధరకే బహిరంగ మార్కెట్లో విక్రయించారు.
మరోవైపు ప్రతి ఏటా సీసీఐ పెట్టే కొర్రీలతో ఇబ్బందులు పడి తక్కువ ధరకు బహిరంగ మార్కెట్లో విక్రయించే రైతులకు ఈ సీజన్లో కూడా బహిరంగ మార్కెట్లే దిక్కయ్యాయి. ఎప్పుడు లేనంతగా బహిరంగ మార్కెట్లో తక్కువ ధర ఉండటంతో అన్నదాతలు గత్యంతరం లేని పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్లో విక్రయించి నష్టపోయారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని విక్రయించాలంటే తప్పనిసరిగా స్లాట్ బుక్ చేసుకోవాలనే నిబంధన పెట్టడంతో.. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు పత్తిని విక్రయిస్తూ నష్టపోయినట్లు రైతులు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఎకరాకు 12 క్వింటాళ్ల నిబంధన ఉండగా.. ఈ ఏడాది ఎకరాకు 7 క్వింటాళ్లకు నిబంధనను కుదించింది. సాధారణంగా ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వచ్చే పరిస్థితులున్నాయి. సీసీఐ పెట్టిన ఈ కొర్రీలతో బహిరంగ మార్కెట్కు తప్పని పరిస్థితుల్లో విక్రయించాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
వారంలోగా చెల్లింపులయ్యేలా చర్యలు
పత్తిని విక్రయించిన అన్నదాతలకు త్వరగా చెల్లింపులు పూర్తయ్యేలా సీసీఐ అధికారులకు సూచిస్తాం. బిల్లులు, ఆధార్ మ్యాపింగ్ లేకపోవడం, బ్యాంకు లింకేజీ సమస్యలతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నది. ఆయా కారణాలతో వెనక్కి వస్తున్న బిల్లులకు సంబంధించి మళ్లీ బిల్లులు చేసి సీసీఐకి పంపిస్తున్నాం. వారంలోగా చెల్లింపులు పూర్తయ్యేలా చర్యలు చేపడుతాం.
– సారంగపాణి, మార్కెటింగ్ జిల్లా అధికారి
45 రోజులుగా డబ్బుల కోసం తిరుగుతున్నా..
సీసీఐ కేంద్రంలో పత్తిని విక్రయించి 45 రోజులు దాటినా నాకు ఇంకా డబ్బులు రాలేదు. పంట పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు సంబంధించి వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నది. వెంటనే డబ్బులు అందజేయాలి. రోజూ సీసీఐ కేంద్రానికి, సంబంధిత అధికారుల వద్దకు వెళ్లి పడిగాపులు కాస్తున్నా వారం రోజుల్లో వస్తాయంటూ బుకాయిస్తున్నారు. వారం రోజుల్లో డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని సర్కారు చెప్తున్నా, నెలల తరబడి పెండింగ్లో పెట్టడం సరికాదు.
– గులాం రసూల్, తరిగోపుల గ్రామం, ధారూరు మండలం