న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ఫైనల్‌కు చేరిన వినేష్ ఫొగాట్‌పై (Vinesh Phogat) అనర్హత వేటు వేయడంపై రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుమారుడైన బీజేపీ ఎంపీ కరణ్ భూషణ్ సింగ్ బుధవారం స్పందించారు. ఆమె అనర్హత దేశానికి తీరని నష్టమని తెలిపారు. ‘ఇది దేశానికి నష్టం. రెజ్లింగ్ ఫెడరేషన్ దీనిని పరిగణనలోకి తీసుకుంటుంది. ఏమి చేయాలో చేస్తుంది’ అని అన్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్ కైసర్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం సభ్యుడైన కరణ్ భూషణ్ సింగ్, ఆ పార్టీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్ అయిన బ్రిజ్ భూషణ్‌పై గత ఏడాది లైంగిక వేధింపు ఆరోపణలు వచ్చాయి. మైనర్లతో సహా అనేక మంది మహిళా రెజ్లర్లను ఆయన లైంగికంగా వేధించినట్లు వినేష్ ఫొగాట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా ఆరోపించారు. ఢిల్లీలో రెజ్లర్ల నిరసనకు వారు నాయకత్వం వహించారు.
మరోవైపు లైంగిక వేధింపు ఆరోపణలను బ్రిజ్ భూషణ్ ఖండించారు. అయితే కోర్టు ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామాలతో రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. అయితే బ్రిజ్ భూషణ్ సన్నిహిత మిత్రుడైన సంజయ్ సింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో 2016 రియో గేమ్స్‌లో కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ దీనికి నిరసనగా రెజ్లింగ్ నుంచి రిటైరైంది.