Barinder Sran : అంతర్జాతీయ క్రికెట్‌కు మరో భారత ఆటగాడు వీడ్కోలు పలికాడు. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) రిటైర్మెంట్ ప్రకటించిన వారం కాకముందే ఫాస్ట్ బౌలర్ బరీందర్ శ్రాన్(Barinder Sran) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ ఎడమ చేతివాటం పేసర్ 31 ఏండ్ల వయసులో ఆటకు అల్విదా చెప్పాడు. టీమిండియా, ఐపీఎల్లో పలు ఫ్రాంచైజీలకు ఆడిన బరీందర్ సుదీర్ఘ కెరీర్‌కు గురువారం రిటైర్మెంట్ ప్రకటించాడు.
గాయాల కారణంగా ఎక్కువ రోజులు క్రికెట్ ఆడలేకపోయిన అతడు ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. అతడు తన ఇన్‌స్టాలో ఏం రాసుకొచ్చాడంటే..? ‘అధికారికంగా నేను క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నా. ఓ సారి నా క్రికెట్ ప్రయాణాన్ని చూసుకుంటే చాలా గర్వంగా ఉంది. 2009లో బాక్సింగ్(Boxing) వదిలేసి క్రికెటర్ అయ్యాను.
ఈ ఆట నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలను కానుకగా ఇచ్చింది. ఫాస్ట్ బౌలింగ్ ఎంచుకోవడం ద్వారా నాకు ఐపీఎల్లో పలు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్య వహించే అవకాశం వచ్చింది. చివరకు 2016లో భారత జట్టుకు ఆడడం నాకు దక్కిన గౌరవం’ అని బరీందర్ అన్నాడు.
హర్యాకు చెందిన బరీందర్ మొదట బాక్సర్ అవ్వాలనుకున్నాడు. కానీ, అనూహ్యంగా క్రికెట్ వైపు మళ్లాడు. 2009లో అతడు ఫాస్ట్ బౌలర్‌గా మారాడు. దేశవాళీ క్రికెట్లో మెరిసిన బరీందర్ ఐపీఎల్‌లోనూ అదరగొట్టాడు. నిలకడగా రాణించిన అతడు సెలెక్టర్ల దృష్టిలో పడి.. 2016లో టీమిండియా జెర్సీ వేసుకున్నాడు. అయితే.. అతడి దేశం తరఫున అతడి కెరీర్ ఎక్కవ రోజులు సాగలేదు.
భారత జట్టు బౌలర్‌గా కేవలం ఆరు వన్డేలు, రెండు టీ20లకే పరిమితం అయిన అతడు 13 వికెట్లతో ఫర్వాలేదనిపించాడు. ఆ తర్వాత గాయాల బారిన పడిన బరీందర్ మళ్లీ జట్టులోకి రాలేదు. దాంతో, ఈ స్పీడ్‌స్టర్ ఐపీఎల్‌కే పరిమితం అయ్యాడు. తొలుత రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన అతడు 2019లో ఐపీఎల్ టైటిల్ గెలుపొందిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టులో సభ్యుడు. బరీందర్ ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లకు ఆడాడు.